తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిరసనల్లో నారీభేరి- వెనక్కి తగ్గని మహిళా రైతులు - దిల్లీ మహిళల నిరసనలు

ఇల్లు చక్కదిద్దడం, పొలం పనుల్లో సాయం చేయడమే కాదు.. భర్తల ఆందోళనల్లోనూ వెంటే ఉంటున్నారు మహిళా రైతులు. తమ కొడుకులు, కూతుళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్నారు. ఎన్ని అసౌకర్యాలు, ఇబ్బందులు ఎదురైనా... నిరసనలను ఉద్ధృతం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

Women join front lines of India farmers' protest
నిరసనల్లో నారీ శక్తి.. వెనక్కి తగ్గని మహిళా రైతులు

By

Published : Dec 30, 2020, 1:13 PM IST

రమణ్​దీప్ కౌర్.. పంజాబ్​కు చెందిన మహిళా రైతు. వృత్తి రీత్యా స్కూల్​లో పాఠాలు చెప్పడం, సాధారణ సమయంలో ఇంట్లో పిల్లలను చూసుకోవడం, మిగిలిన సమయంలో పొలం పనులు చేసుకోవడం ఆమె పని. కానీ, ఇప్పుడు దిల్లీ సరిహద్దులో తన భర్తతో కలిసి నిరసనల్లో పాలుపంచుకుంటున్నారు. ఉదయం నిరసనకారులకు మార్గనిర్దేశం చేయటం, సాయంత్రం ఆహార ఏర్పాట్లను చూడటం ఇప్పుడు ఆమె దినచర్యగా మారింది.

ఇదీ చదవండి: నిరసనలో వైవిధ్యం- వినోదానికీ సంసిద్ధం

రమణ్​దీప్ కౌర్ ఒక్కరే కాదు.. దిల్లీ సరిహద్దులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న మహా ఉద్యమంలో వందలాది మహిళా రైతులు భాగమవుతున్నారు. ఏళ్ల తరబడి వ్యవసాయం చేసిన వీరంతా.. తమ భవిష్యత్తుపై ఆందోళనలతో రోడ్డుకెక్కారు. తమ జీవిత భాగస్వాములతో నడుస్తూ.. నిరసనల్లోనూ వెన్నంటే అన్న నినాదాన్ని వినిపిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ ఆందోళనకు వెనకడుగు వేయడం లేదు.

"ఈ చట్టాలు రైతులకు ప్రయోజనం చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మరి ముందుగానే రైతులను ఎందుకు సంప్రదించలేదు? మా యూనియన్ నేతలతో ఎవరూ మాట్లాడలేదు. ఈ చట్టాలన్నీ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని అంటున్నారు. కరోనా సమయంలో, అందరూ ఇంట్లో ఉన్నప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టాలను అమలుచేశారు. వీటిని ఎవరూ వ్యతిరేకించకుండా ఉండేందుకు అలా చేశారు."

-రమణ్​దీప్ కౌర్, మహిళా రైతు

తొలుత పదుల సంఖ్యలోనే కనిపించిన వీరి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రైతులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, నర్సులు, వృద్ధులు ఇందులో పాల్గొనే స్థాయికి చేరింది. కలుపుతీస్తూ కాలం గడిపే వీరందరికీ జాతీయ రహదారులే కొత్త ఆశ్రయాలయ్యాయి.

ఆందోళనల్లో మహిళలు

ఇదీ చదవండి:అన్నదాతలకు అండగా- పోరాటానికి మద్దతుగా

నష్టం మహిళలకే!

వాస్తవానికి ఈ నిరసనల్లో మహిళలు పాల్గొన్న విషయం పెద్దగా వెలుగులోకి రావడం లేదు. కానీ.. నూతన చట్టాల వల్ల వారికే ఎక్కువగా నష్టం జరుగుతోందని మహిళా కిసాన్ అధికార్ మంచ్(ఎంఏకేఏఏఎం) ఫోరం చెబుతోంది. మహిళా రైతుల హక్కులపై పోరాడే ఈ సంస్థ.. పలు చేదు వాస్తవాలను బయటపెట్టింది. 75 శాతం పొలం పనులు మహిళా రైతులే చేసినప్పటికీ.. 12 శాతం మంది మాత్రమే ఆ వ్యవసాయ భూమికి యజమానులుగా ఉన్నారని తెలిపింది. ఈ రంగానికి మహిళలు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తున్నప్పటికీ.. భూమి లేని వారిని రైతులుగా గుర్తించడం లేదని పేర్కొంది. ఈ నూతన చట్టాల వల్ల కార్పొరేట్ల దోపిడీకి మహిళా రైతులు బాధితులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

వంట కోసం..

ఇదీ చదవండి:మైదానంలో ఉల్లిగడ్డలు పండిస్తూ రైతుల నిరసన

అసౌకర్యాల మధ్యే...

పోలీసుల లెక్కల ప్రకారం నిరసనలు జరుగుతున్న ప్రదేశంలో 25 మంది మరణించారు. ఇక్కడ సరైన వసతులు లేకపోవడమే అధిక మరణాలకు కారణమని చెబుతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా లేవు. దిల్లీ సరిహద్దులో చలిగాలుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్​కే పరిమితమవుతున్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా మహిళా రైతులు వెనక్కి తగ్గడం లేదు. అసౌకర్యాల గురించి మాట్లాడటం అటుంచితే... డిమాండ్లు నెరవేరే వరకు కదిలేది లేదని శపథం చేస్తున్నారు. పోరాటంలో విజయం తప్పక సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు.

"మేం గెలుస్తామని నమ్మకం ఉంది. మా సంఘాలపై విశ్వాసం ఉంది. వారికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం సమ్మతిస్తాం. వారికి అండగా నిలబడతాం. మేం గెలుస్తామని విశ్వాసంతో ఉన్నాం.

-సోహజ్​దీప్ కౌర్, మహిళా రైతు

పిజ్జాలు, పిస్తాలు తినేందుకే నిరసనకారులు దిల్లీ సరిహద్దుకు వస్తున్నారన్న ఆరోపణలపై మహిళా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ తినాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఆహారాన్ని స్వయంగా వండుకుంటున్నామని, వచ్చి పోయే ప్రయాణికులకు కూడా ఆహారం అందిస్తున్నామని చెబుతున్నారు.

నిరసనల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు

రాష్ట్ర వ్యాప్త ర్యాలీలు

దిల్లీలోనే కాదు స్వస్థలాల్లోనూ మహిళలు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. దిల్లీకి రాలేనివారు.. సొంత ఊరిలోనే ర్యాలీలు తీస్తున్నారు. పంజాబ్​లోని దాదాపు 100 ప్రదేశాల్లో ఇలాంటి నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. పురుషులంతా రాజధాని సరిహద్దుకు చేరుకోవడం వల్ల.. ఇంటి బాగోగులతో పాటు.. వ్యవసాయ పనులను సమన్వయంతో చేసుకుంటున్నారు. దిల్లీకి వెళ్లి తిరిగొచ్చినవారు సైతం పంజాబ్​లో నిరసన చేస్తున్నారు.

ప్రార్థనలు చేస్తున్న మహిళలు

పంజాబ్​లోని సంగ్రూర్​లో నిర్వహించిన ఆందోళనలకు పది వేల మంది మహిళలు హాజరైనట్లు భారతీయ కిసాన్ యూనియన్(ఉంగ్రాహన్) వెల్లడించింది. పట్టణంలోని రహదారిని తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. టోల్​ ప్లాజాలు, కార్పొరేట్ సంస్థల పెట్రోల్ పంప్​లు, మాళ్లు, ప్లాజాల ఎదుట కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details