Women in Indian Army: భారత భద్రతా బలగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషులకు దీటుగా సేవలు అందిస్తున్న మహిళా జవాన్లు.. ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశ భద్రతకు ముప్పు కలగకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్లోని భారత్ చైనా సరిహద్దు వద్ద మహిళా బలగాలు గస్తీ కాస్తున్న వీడియోను ఐటీబీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇండో-టిబెటన్ బార్డర్ పోలిస్కు (ఐటీబీపీ) చెందిన వీరు తుపాకులు చేతపట్టి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ స్థానికులకు రక్షణ కల్పిస్తున్నారు.
'నారీశక్తికి నా సెల్యూట్'
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా మహిళలకు అభినందనలు తెలిపారు. 'వివిధ రంగాల్లో విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నా వందనాలు' అని పేర్కొన్నారు. వివిధ పధకాల ద్వారా మహిళా సాధికారికత కోసం ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు.
"ఆర్థిక సాయం, సామాజిక భద్రత, ఆరోగ్య సేవలు, విద్య, వ్యాపారం ఇలా వివిధ రంగాల్లో నారీశక్తిని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కేంద్రం కృషి చేస్తోంది. భవిష్యత్తులో ఈ కృషిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తాం."
-నరేంద్ర మోదీ, ప్రధాని