తన పిల్లల కంటే చదువులో ముందున్నాడని కూల్ డ్రింక్‌లో విషం కలిపిందో మహిళ. అది తాగిన బాలుడు వాంతులు చేసుకుని ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన పుదుచ్చేరిలోని కారైకాల్ మున్సిపాలిటీలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాల మణికందన్ స్కూల్ వార్షిక దినోత్సవం సందర్భంగా ప్రాక్టీస్ చేయడానికి వెళ్లాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం వాంతులు చేసుకోవడం మొదలు పెట్టాడు. తల్లిదండ్రులు వెంటనే మణికందన్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే అతడు మృతిచెందాడు.
అయితే స్కూల్ వాచ్మెన్ కూల్ డ్రింక్ ఇచ్చినప్పటి నుంచి వాంతులు చేసుకుంటున్నాడని మణింకందన్ తండ్రి ఆరోపించారు. తల్లిదండ్రులు ఇచ్చిన కూల్ డ్రింక్స్‌నే పిల్లలకు ఇచ్చామని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. తాము ఇవ్వలేదని బాలుడి తల్లిదండ్రులు అంటున్నారు. అయితే ఈ విషయంపై వాచ్మెన్ దేవదాస్‌ను నిలదీయగా, బాలుడికి సంబంధించిన వారే ఆ డ్రింక్ ఇచ్చారని చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా సకయా రాణి విక్టోరియా అనే మహిళ ఇచ్చిందని స్పష్టమైంది. విక్టోరియా పిల్లలు కూడా అదే పాఠశాలలో చదవుతున్నారు. దీనిపై బాలుడి తల్లి మాలతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
మణికందన్‌కు విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన విద్యార్థి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.