తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త కోసం మొసలితో పోరాడిన భార్య.. ప్రాణాలకు తెగించి.. - వ్యక్తిపై మొసలి దాడి

చంబల్‌ నది తీరాన మొసలి నోటికి చిక్కిన భర్తను కాపాడుకునేందుకు వీరోచితంగా పోరాడింది ఓ మహిళ. భర్త ప్రాణాలు నిలిపేందుకు మొసలిపైనే దాడి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

women fight with crocodile for husband
భర్త కోసం మొసలితో పోరాడిన మహిళ

By

Published : Apr 13, 2023, 7:03 AM IST

Updated : Apr 13, 2023, 7:28 AM IST

మొసలి నోటికి చిక్కిన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళ వీరోచితంగా పోరాడింది. భర్త కాళ్లను నోటితో పట్టుకుని, నీటిలోకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేసిన.. మొసలిపైనే దాడి చేసింది. ధైర్యంగా మొసలిని ఎదుర్కొని.. క్రూర జంతువు నుంచి భర్త ప్రాణాలు కాపాడింది. రాజస్థాన్​లోని కరౌలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
మండరాయల్‌ సబ్‌ డివిజన్​ పరిధిలో నివాసం ఉండే బనీసింగ్‌ మీనా (29) ఓ మేకల కాపారి. అతని భార్య విమలాబాయి. మంగళవారం.. ఇద్దరు కలిసి మేకలను మేపేందుకు చంబల్‌ నది తీర ప్రాంతానికి వెళ్లారు. అనంతరం వాటికి నీళ్లు తాగించేందుకు బనీసింగ్‌ మీనా.. నది వద్దకు వెళ్లాడు. తనకు కూడా దాహంగా ఉండటం వల్ల నీటికి దగ్గరగా వెళ్లి రెండు దోసిళ్లతో నీరు తాగబోయాడు. అంతే.. నీటి మాటు నుంచి ఒక్క ఉదుటున లేచింది మొసలి. వెంటనే బనీసింగ్‌పై దాడి చేసింది. అతడి కాలిని నోట కరచుకుని నీటి లోపలికి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది.

భర్త కోసం మొసలితో పోరాడిన మహిళ

దీంతో బిత్తరపోయిన బనీసింగ్‌.. గట్టిగా కేకలు వేశాడు. కాస్త దూరంలో ఉన్న విమలాబాయి.. భర్త కేకలు వినింది. పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. పరిస్థితిని చూసి బిత్తరపోయింది. వెంటనే తేరుకొని.. నదికి దగ్గరగా వెళ్లి చేతిలో ఉన్న కర్రతో మొసలిపై దాడి చేసింది. దాని తలపై పదే పదే బాదింది. దీంతో కాసేపటికి బనీసింగ్‌ కాలు వదిలేసి నీటిలోకి వెళ్లిపోయింది మొసలి. ఇది గమనించిన చుట్టుపక్కల గొర్రెలు మేపుతున్న వారు అక్కడికి చేరుకొన్నారు. తీవ్రంగా గాయపడిన బనీసింగ్‌ను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

'నా భార్య ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది.. నా కళ్ల ముందు చావు కనిపించింది.' అని బనీసింగ్‌ తెలిపాడు. మృత్యువుతో పోరాడుతున్నట్లు తనకి తెలుసని.. ఆ క్షణంలో భర్త ప్రాణాలను కాపాడుకోవడమే తన లక్ష్యమని విమల తెలిపింది. దీంతో భయం వేయలేదని ఆమె వెల్లడించింది.

కూతురి కోసం అడవి పందితో పోరాడి ఓడిన తల్లి..
కొద్ది రోజుల క్రితం ఛత్తీస్​గఢ్​లో కూతురి కోసం అడవి పందితో పోరాడింది ఓ తల్లి. కూతురిని కాపాడేందుకు తన ప్రాణాలనే అడ్డేసింది. అడవి పందితో విరోచితంగా పోరాడి.. కూతురిని రక్షించింది. తాను మాత్రం ప్రాణాలను పోగొట్టుకుంది. కోర్బా జిల్లా, పసన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని తెలియమార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దువాషియా భాయి(​45) అనే మహిళ తన కూతురు రిం​కీని వెంట తీసుకుని మట్టి కోసం దగ్గర్లో ఉన్న పొలానికి వెళ్లింది. పారతో మట్టిని తవ్వుతుండగా హఠాత్తుగా వారిపైకి అడవి పంది వచ్చింది. రిం​కీపై పంది దాడి చేసింది. దీంతో కూతురిని కాపాడేందుకు.. అడవి పందిని దవాషియా ఎదుర్కొంది. తన దగ్గర ఉన్న గొడ్డలితో దానిపై దాడి చేసింది. రిం​కీ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంది. అయితే, అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ దువాషియా.. చివరకు ప్రాణాలు కోల్పోయింది.

Last Updated : Apr 13, 2023, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details