దానం చేయాలంటే ఆస్తులు లేకపోయినా సేవ చేసే గుణం ఉంటే చాలు అని నిరూపించింది ఒడిశాకు చెందిన ఓ మహిళ. పుల్భాని నగరంలో ఉన్న జగన్నాథస్వామి ఆలయ పునరుద్ధరణ కోసం తాను యాచించి సంపాదించిన రూ.లక్షను విరాళంగా ఇచ్చింది.
యాచకురాలి పెద్ద మనసు.. జగన్నాథస్వామి గుడికి రూ.లక్ష విరాళం - orissa latest news
పేదరికంలో ఉండి భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్న ఓ మహిళ.. తాను దాచిపెట్టిన సొమ్మును దానం చేసింది. జగన్నాథ స్వామి ఆలయ పునరుద్ధరణకు లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చింది.
పుల్భాని నగరానికి చెందిన తుల బెహరా(70) గత 40 ఏళ్లుగా జగన్నాథస్వామి గుడి వద్ద భిక్షాటన చేస్తోంది. అలా లక్ష రూపాయలను కూడబెట్టింది. తన భర్త మరణించాక నగరంలో వివిధ చోట్ల నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో కడుపు నింపుకునేది. జగన్నాథస్వామి ఆలయంతో పాటు శివాలయం, సాయిబాబా గుడి దగ్గర కూడా భిక్షాటన చేసేది. కొన్నేళ్ల క్రితం ఉకియా మహాకుడ్ అనే నిరుపేద మహిళను ఆమె పెంచుకుంది. తన ఆలనాపాలనా తుల బెహరా చూసుకుంటుంది. వీరిద్దరు కలిపి శుక్రవారం జగన్నాథ స్వామి ఆలయ పునరుద్ధరణ కోసం కమిటీ సభ్యులకు రూ.లక్షను విరాళంగా అందజేశారు.
యాచకురాలిని శాలువాతో సత్కరించి తన సేవగుణాన్ని కమిటీ సభ్యులు కొనియాడారు. పురాతన జగన్నాథస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి సాధువులకు వసతి కల్పిస్తామని తెలిపారు.