తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీతీశ్ అలా చేస్తే ప్రచారం మానేస్తానన్న పీకే

బిహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనపై నీతీశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే తాను ప్రచారం మానేస్తానని అన్నారు.

prashanth kishor on nitish kumar
prashanth kishor comments

By

Published : Aug 18, 2022, 2:10 PM IST

Prashanth kishore Nitish: స్వాతంత్య్ర దినోత్సవం వేళ బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఇచ్చిన వాగ్దానాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మహాకూటమి ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే బిహార్‌లో తాను ప్రచారాన్ని ఆపేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'జన్‌ సురాజ్‌ అభియాన్‌'ను ఉపసంహరించుకొని నీతీశ్‌కు మద్దతు ప్రకటిస్తానని తెలిపారు.

ఇటీవల స్వాతంత్య్ర వేడుకల్లో నీతీశ్ కుమార్‌ మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. తేజస్వీ యాదవ్‌ లాంటి యువతరం నేతల సహకారంతో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. నీతీశ్‌ వ్యాఖ్యలపై ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా స్పందించారు. "వచ్చే రెండేళ్లలో నీతీశ్ ప్రభుత్వం 5 నుంచి 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తే.. నేను 'జన్‌ సురాజ్‌ అభియాన్‌' ప్రచారాన్ని ఉపసంహరించుకుంటాను. నీతీశ్ సర్కారుకు మద్దతు ప్రకటిస్తాను" అని పీకే చెప్పుకొచ్చారు.

బిహార్‌ రాజకీయాల్లోకి తాను వచ్చి కేవలం మూడు నెలలే అవుతుందని, కానీ, ఈ స్వల్పకాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరిగాయని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని సంచలనాలు జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సీఎం నీతీశ్‌పై పీకే వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. "ముఖ్యమంత్రి పదవి కోసం ఇతర పార్టీలన్నీ ప్రయాసలు పడుతుంటే.. నీతీశ్ కుమార్‌ మాత్రం ఫెవికాల్‌ వేసుకొని మరీ సీఎం కుర్చీకి అతుక్కుని కూర్చున్నారు" అని విమర్శించారు.

ప్రశాంత్ కిశోర్‌ గతంలో జేడీయూలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీ ఆయనపై వేటు వేసింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పీకే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. హస్తం పార్టీ కూడా ఆయనకు ఆహ్వానం పలికింది. కానీ, ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన పీకే.. బిహార్‌ రాజకీయాలపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగానే 'జన్‌ సురాజ్‌ అభియాన్‌' పేరిట కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబరు 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి:8 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం వేటు, ఎందుకంటే

ఫోన్​ ఏదైనా ఛార్జర్ ఒకటే, కేంద్రం కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details