తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్ శాంతిమంత్రం- అనూహ్య మార్పులకు ఇదే కారణం!

భారత శాంతి మంత్రాన్ని దాయాది పాకిస్థాన్ ఒడిసి పట్టుకుందా.. అన్నంతగా సరిహద్దుల్లో తుపాకీ మోతలు నిలిచిపోయాయి. వారం రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ దళాలు తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నాయి. పాకిస్థాన్‌ వైఖరిలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పుల వెనుక తప్పనిసరి కారణాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే?

Will the renewed ceasefire between India and Pakistan last long?
పాక్ శాంతిమంత్రం- అనుహ్య మార్పులకు ఇదే కారణం!

By

Published : Mar 2, 2021, 6:45 PM IST

సీమాంతర ఉగ్రవాదం అన్నది పాకిస్థాన్‌ విదేశీ విధానాల్లో ఒకటిగా మారిందన్నది భారత్ చేసే ఆరోపణ. దీనికి తగ్గట్లుగానే భారత్‌ను అస్థిర పరిచేందుకు ముష్కర మూకను దేశంపైకి దాయాది ఎగదోస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉగ్రతండాలకు ఆవాసంతో పాటు ఆర్థిక సాయం అందిస్తూ.. అనేక సార్లు అంతర్జాతీయ సమాజం ఎదుట అడ్డంగా పాకిస్థాన్‌ దొరికిపోయింది.

ఎన్నో కారణాలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్లు.. ఉగ్రవాదంతో పాటు అంతర్గతంగా ఉన్న సమస్యలు, రాజకీయపరమైన సమస్యలు పాకిస్థాన్‌ను ఛిన్నాభిన్నం చేశాయి. ఆర్థికంగా చితికిపోయేలా చేశాయి. ప్రతి కార్యక్రమానికి ఇతరుల దగ్గర దేబరించాల్సిన దుస్థితికి పాక్ జారుకుంది. ఈ తరుణంలో ఆర్థిక చర్యల కార్యాచరణ దళం(ఎఫ్ఏడీఎఫ్) కూడా 'గ్రే' కొరడా ఝులిపించడం వల్ల.. వచ్చే నిధులు కూడా నిలిచిపోయాయి. ఉగ్రముద్ర పోగొట్టుకుంటే తప్ప రూపాయి రాలని పరిస్థితి. అందుకే ఆ మరక చెరిపేసుకోవడం కోసం ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

పాకిస్థాన్‌ దొంగాటలు, ఉగ్రచర్యల విషయంలో బాహాటంగా అన్ని అంతర్జాతీయ వేదికలపై భారత్ నిప్పులు చెరుగుతూ వస్తోంది. దాయాది నైజాన్ని బట్టబయలు చేస్తోంది. అబోటాబాద్‌లో అల్‌ఖైదా అగ్రనేతను అమెరికా దళాలు అంతమొందించడం సహా లాడెన్ పాకిస్థాన్ రాజకీయ నాయకులతో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఇటీవల వెలువడిన వార్తలు పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో ఎఫ్ఏటీఎఫ్ విధించిన గడువు కూడా ముంచుకొస్తుండడం వల్ల.. ఇరుగు మంచి పొరుగు మంచి అంటున్న భారత్‌తో కలిసి శాంతి మంత్రం జపించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కఠినంగా అమలు చేయాలన్న భారత్ నిర్ణయానికి పాకిస్థాన్ జై కొట్టడమే కాక.. వాస్తవరూపంలోకి తేవడం వల్ల సరిహద్దుల్లో తుపాకుల మోతలు నిలిచి పోయాయి.

ఉగ్రమూకలు ఆగినట్టే..

తుపాకుల మోతలు నిలిచాయంటే దానర్థం పాకిస్థాన్ నుంచి భారత్‌కు ఉగ్రమూకల ఎగుమతి ఆగిందనే. పాక్ సైన్యం సాయంతోనే ఉగ్రవాదులు ఇన్నాళ్లూ భారత్‌లోకి ప్రవేశించగలుగుతూ వచ్చారు. ఇష్టారీతిన.. భారత పోస్టులపై దాయాది సైన్యం కాల్పులకు తెగపడుతూ.. ఉగ్రమూకకు భారత్‌లోకి వెళ్లేందుకు అవకాశాలు కల్పించేవి. ఇప్పుడు ఈ కాల్పులు ఆగాయంటే దానర్థం.. సీమాంతర ఉగ్రవాదానికి ఇమ్రాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్ స్వస్తి పలికేందుకు సమాయత్తమవుతున్నట్లే. తద్వారా ఎఫ్ఏటీఎఫ్ నిషేధం నుంచి తప్పించుకోవచ్చు కూడా. ఈ నిర్ణయం దాయాది నేలపై ఉన్న ఉగ్రతండాలకు ఏ మాత్రం రుచించకున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ అంగీకరించాల్సి వచ్చింది.

ఆ ప్రాజెక్టులూ కారణం

ఎఫ్ఏటీఎఫ్​తో పాటు మరో విషయం కూడా పాకిస్థాన్‌ను కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా ప్రేరేపించింది. పాకిస్థాన్‌ నేలపై చైనా తలపెట్టిన సీపీఈసీ కారిడార్ పనులు ఏ ఆటంకం లేకుండా సుజావుగా సాగాలంటే సరిహద్దుల్లో ప్రశాంతత అత్యావశ్యం. ఇప్పటికే గిల్గిత్ బాల్టిస్థాన్‌ను పాక్‌లోని ఓ ప్రావిన్స్‌(రాష్ట్రం)గా మార్చుతూ దాయాది అవసరమైన రాజ్యాంగపరమైన ప్రక్రియను కూడా పూర్తి చేసింది. తద్వారా సీపెక్ వేగవంతం అవుతుంది. అంతేకాకుండా చైనా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీఆర్‌ఐ ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతం మీదుగానే వెళ్తుంది.

ఇలాగే అమలవుతుందా..?

ఈ మొత్తం విషయాల్లో భారత్ ఎక్కువగా స్పందించకుండా ఉండాలంటే భారత్‌తో సరిహద్దుల్లో కయ్యం లేకుండా ఉండి తీరాలి. ఇవన్నీ జరగాలంటే సరిహద్దుల్లో భారత్ వైపు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. భారత్‌లోకి ఉగ్రమూకల రాకపోకలు నిలిచిపోవాలి. అటు.. భారత్‌ కూడా జమ్ముకశ్మీర్‌లో చేపట్టే ప్రాజెక్టులు వేగంగా సాగాలని కోరుకుంటోంది. అందుకు ఆ రాష్ట్రంలో శాంతి వెల్లివిరయడం అవసరం. అందుకే ఉభయతారకంగా.. భారత్ సైన్యం చేసిన ప్రతిపాదనను పాక్ వెంటనే అమల్లో పెట్టి చూపించింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం పటిష్ఠంగా అమలవుతుంది అన్న దానిపై సందేహాలు అలానే ఉన్నాయి.

(బిలాల్ భట్- ఈటీవీ భారత్ న్యూస్ ఎడిటర్)

ఇదీ చదవండి:కేరళను మళ్లీ పట్టేస్తారా? బంగాల్​లో పోటీ ఇస్తారా?

ABOUT THE AUTHOR

...view details