అటు ఇటుగా 15 నెలలు... గుజరాత్ అసెంబ్లీ (gujarat assembly) గడువు ముగియడానికి ఉన్న సమయమిది! ఈ తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఏకంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (vijay rupani) తన పదవికి రాజీనామా చేశారు. ఎలాంటి ఊహాగానాలు లేకుండా జరిగిన ఈ పరిణామం ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులనూ షాక్‌కు గురి చేసింది!
కరోనా నేపథ్యంలో భాజపా ఇటీవల అనేక మార్పులు చేపట్టింది. కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసింది. దీంతో పాటు రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చింది. ఇందులో ఓ రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు. మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటితో పోలిస్తే.. రెండో హయాంలోనే ఇలా నాయకత్వ మార్పులు తరచుగా జరుగుతున్నాయి. 2014-19 మధ్య అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌ను మాత్రమే రాజీనామా చేయాలని భాజపా అధిష్ఠానం కోరింది.
కారణమిదే!
క్షేత్రస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించి.. సమస్యలకు పరిష్కారంగానే భాజపా అధినాయకత్వం (BJP leadership) తాజా మార్పులు చేపట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణతో (Union Cabinet reshuffle) పాటు రాష్ట్రస్థాయిలో జరుగుతున్న మార్పులు.. భాజపా సంప్రదాయ రాజకీయాలను సూచిస్తున్నాయని చెబుతున్నారు. కుల రాజకీయాలకు తావిస్తున్నాయని అంటున్నారు. కేబినెట్లో తీసుకున్న మంత్రుల్లో 27 మంది ఓబీసీలు, 12 మంది దళితులు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అగ్రవర్ణ పార్టీ అన్న ముద్రను తొలగించుకోవడం సహా.. అన్ని వర్గాలకు భాజపా పెద్దపీట వేస్తుందనే సందేశాన్ని అందించిందని విశ్లేషిస్తున్నారు.
కుల సమీకరణాలు
కర్ణాటకలో లింగాయత్ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను (BS Yediyurappa) తొలగించి.. మరో లింగాయత్ నేత బసవరాజ్ బొమ్మైను (Basavaraj Bommai) ఆ స్థానంలో కూర్చొబెట్టింది. ఉత్తరాఖండ్‌లో ఇద్దరు 'ఠాకూర్'లను మార్చింది. చివరకు మరో ఠాకూర్‌కు సీఎం బాధ్యతలు అప్పగించింది. ఈ సామాజిక వర్గాలన్నింటికీ ఆయా రాష్ట్రాల్లో భారీ ఓటర్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలోనే రూపానీని సైతం పదవి నుంచి దించేసినట్లు తెలుస్తోంది.
విజయ్ రూపానీ.. జైన కుటుంబంలో జన్మించారు. ఈ సామాజిక వర్గానికి గుజరాత్లో అంతగా ప్రభావం లేదు. అందువల్లే రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న 'పాటీదార్' వర్గానికి (Patidar Community) చెందిన నేతకు సీఎం పగ్గాలు అప్పగించేందుకు ఈ రాజీనామా చేయించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.