సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలంటే స్థానిక అంశాల చుట్టూ తిరుగుతూ, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చే తీర్పు! కానీ మంగళవారంతో ముగిసిన (బెంగాల్‌లో ఇంకా ఐదు అంచెలు మిగిలి ఉన్నాయి) అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మాత్రం అంతకంటే ఎక్కువే దాగుంది. జాతీయస్థాయిలో రాజకీయంగా చోటు చేసుకుంటున్న సంస్థాగత మార్పుల నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలివి. ఉనికిని ఎలా కాపాడుకోవాలో తెలియని స్థితిలో కాంగ్రెస్.. తమ ప్రాభవం నానాటికీ తగ్గుతున్న భాజపా వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు.. మరోవైపు రోజురోజుకూ తన బలాన్ని, బలగాన్ని విస్తరించుకుంటూ వెళుతున్న భారతీయ జనతాపార్టీ! బలమైన కేంద్రం రాష్ట్రాలను బలహీన పరుస్తూ, రాజ్యాంగం తమకిచ్చిన అంశాల్లోనూ వేలుపెడుతోందని, తద్వారా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని భాజపేతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.
సంస్కరణల పథం వేగం
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ అస్సాంలో భాజపా తన అధికారాన్ని నిలబెట్టుకొని, బెంగాల్‌లో గెలిచి, తమిళనాట అన్నాడీఎంకే కూటమి తిరిగి గద్దెనెక్కితే.. మోదీసర్కారు కేంద్రంలో తన సంస్కరణల పథాన్ని మరింత వేగవంతం చేస్తుందనటంలో సందేహం లేదు. తొలుత ఆర్థిక సంస్కరణలు, ఆ తర్వాత వ్యవసాయ, బ్యాంకింగ్ సంస్కరణలు, ఓబీసీల వర్గీకరణ మోదీ ప్రభుత్వం ముందున్న అజెండా! లోక్‌సభలో తిరుగులేని మద్దతున్న మోదీ ప్రభుత్వానికి రాజ్యసభలోనూ దారి సులభమవుతుంది. ఒకవేళ బెంగాల్‌లో తృణమూల్ మళ్లీ నెగ్గి, తమిళనాట డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చి, అస్సాంలో కాంగ్రెస్ గద్దెనెక్కితే.. అప్పుడు భాజపా వ్యతిరేక శక్తుల గళం పెరుగుతుంది. ముఖ్యంగా తృణమూల్ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే.. మమతా బెనర్జీ సారథ్యంలో భాజపా వ్యతిరేక శక్తులు జాతీయస్థాయిలో ఏకమయ్యేందుకు మార్గం సుగమమవుతుంది.