Recording wife phone calls: భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేయడం గోప్యతా ఉల్లంఘన కిందకు వస్తుందా అనే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. పంజాబ్, హరియాణా ఉన్నత న్యాయస్థానం గతేడాది డిసెంబర్ 12 ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. సంబంధిత పార్టీలకు నోటీసులు పంపించాలని జస్టిస్ వినీత్ శరణ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం జనవరి 12న ఆదేశాలు జారీ చేసింది.
Recording wife phone calls:
దొంగచాటుగా భార్య ఫోన్ సంభాషణలను రికార్డు చేయడం తప్పేనని పంజాబ్-హరియాణా హైకోర్టు డిసెంబర్లో తీర్పు చెప్పింది. భార్యకు తెలియకుండా ఇలాంటి పనులు చేయడం ఆమె గోప్యతకు భంగం కలిగించినట్టే అవుతుందని పేర్కొంది.
Recording wife conversation SC
ఓ కేసులో భాగంగా తన భార్య ఫోన్ సంభాషణలకు సంబంధించిన సీడీని సమర్పిస్తానని భర్త చెప్పగా బఠిండాలోని కుటుంబ న్యాయస్థానం అంగీకరించింది. అయితే, తన అనుమతి లేకుండా రికార్డు చేసిన మాటలను సాక్ష్యంగా పరిగణించకూడదంటూ ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించారు. భారత సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన మాటలను సాక్ష్యాలుగా పరిగణించకూడదని, కానీ కుటుంబ న్యాయస్థానం దీన్ని పట్టించుకోలేదని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఆమె చెప్పిన మాటల్లో వాస్తవం ఉన్నా దాన్ని సాక్ష్యంగా పరిగణించకూడదని వాదించారు.
చాలా క్రూరంగా హింసించడం వల్లనే దీన్ని రికార్డు చేయాల్సి వచ్చిందని భర్త తరఫు న్యాయవాది తెలిపారు. ఇది అదనపు సాక్ష్యమేమీ కాదని, ఒక అంశాన్ని నిరూపించడానికి ఉద్దేశించిందని పేర్కొన్నారు. దీంతో ఏకీభవించని న్యాయమూర్తి కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించారు.
అది క్రూరత్వం కాదు: సుప్రీం
మరోవైపు, భద్రత కోసం కోడలి ఆభరణాలను తమ అధీనంలో ఉంచుకోవడం ఐపీసీ చట్టం ప్రకారం క్రూరమైన చర్య కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వతంత్రంగా జీవిస్తున్న సోదరుడిని నియంత్రించలేకపోవడం, సర్దుబాటు చేసుకోవాలని కోడలికి సలహా ఇవ్వడం.. ఐపీసీ సెక్షన్ 498ఏ క్రూరత్వం కాదని తెలిపింది.
తనను హింసిస్తున్నారంటూ ఓ మహిళ.. తన భర్త, అతడి బంధువులపై కేసు నమోదు చేసింది. సెక్షన్ 498ఏ ప్రకారం అభియోగాలు మోపింది. అయితే, ఈ కేసు ఉన్నప్పటికీ తనను అమెరికా వెళ్లేలా అనుమతించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త.. పంజాబ్, హరియాణా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను తోసిపుచ్చుతూ హైకోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబట్టింది.
'నిందితులంతా తన జీవితాన్ని నాశనం చేశారని మాత్రమే మహిళ ఆరోపణలు చేశారు. ఆభరణాలు తీసుకున్నారన్న విషయంపై ఎలాంటి స్పష్టమైన వివరాలు తెలియజేయలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు క్రూరమైన చర్యలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఇలాంటప్పుడు పిటిషనర్‌ను (భర్త) భారత్‌లోనే ఉండాలని ఆదేశించడం ఎందుకో అర్థం కావడం లేదు' అని సుప్రీం పేర్కొంది.
ఇదీ చదవండి:హెచ్ఐవీ సోకిందన్న విషయం దాచి.. భార్యపై వరకట్న వేధింపులు!