Wife And Husband Murder In Odisha :ఒడిశా.. గజపతి జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో భార్యాభర్తలను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు కొందరు దుండగులు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని అడబా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోడపంకా గ్రామంలో కపిలేంద్ర మల్లిక్ తన భార్య సస్మితతో నివాసం ఉంటున్నాడు. తాజాగా ముగ్గురు దుండగులు మల్లిక్ ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధంతో అతడిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్నభార్య సస్మిత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన నిందితులు ఆమెను వెంటాడి తమతో తెచ్చుకున్న గొడ్డలితో నరికి చంపారు. తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో చేతబడి చేస్తున్నాడనే నెపంతో మల్లిక్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ హత్యలకు కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. పాత కక్షనే కారణమని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కొందరు గ్రామస్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
డబ్బులు ఇవ్వలేదని చితకబాది..
School Student Murder In Odisha : ఒడిశా.. సుందర్‌గఢ్ జిల్లాలోని కచరపులియా ప్రాంతంలో ఓ పాఠశాల విద్యార్థిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు. అయితే మృతి చెందిన బాలుడు అతడి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడని.. ఆ సమయంలో కొందరు మిత్రులు అతడిని డబ్బులు అడిగారని బాలుడు తరఫు బంధువు ఒకరు తెలిపారు. ఇందుకు బాలుడు నిరాకరించడం వల్ల కోపంతో తోటి స్నేహితులే అతడిని కొట్టి చంపారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ బాలుడు నేరాన్ని అంగీకరించాడని, ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడని ఆయన చెప్పారు. అయితే ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తంగర్‌పలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
"సెప్టెంబర్ 24 (ఆదివారం) నుంచి బాలుడు తప్పిపోయాడు. అతడు గణేష్ నిమజ్జన ఊరేగింపును చూడటానికి తన తండ్రి దుకాణం నుంచి వచ్చాడు. అయితే ఊరేగింపు తర్వాత బాలుడు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పిపోయాడని ఫిర్యాదు చేశాం"