తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిల్​స్టేట్​లో 'హిట్' కొట్టేదెవరు? ఈ 'సీఎం'తో అయినా ట్రెండ్ మారేనా? - congress Harish Rawat

Uttarakhand assembly election: ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికలు ఆఖరి అంకానికి చేరుకున్నాయి. ఐదో శాసనసభకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ద్విముఖ పోటీ నెలకొంది. అధికార భాజపా.. ప్రతిపక్షం కాంగ్రెస్​ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ.. తిరిగి గెలిచిన దాఖలాలు ఉత్తరాఖండ్​లో లేవు. అయితే ఈ సారి ఆ చరిత్రను తిరిగి రాయాలని భాజపా.. సెంటిమెంట్​ను అనువుగా మార్చుకొని విజయం సాధించాలని కాంగ్రెస్​ తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుంది? కేజ్రీవాల్​ ఫాక్టర్​ ఎవరికి మైనస్​ అవుతుంది? సీఎంలు ఓడిపోవడం అనవాయితీగా వస్తున్న నేపథ్యంలో.. ఆ ట్రెండ్​కు ధామీ చెక్​ పెడతారా? మోదీ ఇమేజ్​ భాజపాకు ఏ మేరకు కలిసి వస్తుంది? గతంలో ఆరువేల ఓట్లు పడ్డ అభ్యర్థి కూడా ఎమ్మెల్యే అయిన ఈ రాష్ట్రంలో.. ఈసారి అలాంటి గమ్మత్తులు జరిగేనా?

who will be win uttarakhand assembly elections
హిల్​స్టేట్​లో 'హిట్' షో ఎవరిది?

By

Published : Feb 11, 2022, 5:02 PM IST

  • యువతకు 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు
  • పేదలకు ప్రతి సంవత్సరం మూడు ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితం
  • కొండ ప్రాంతాల్లో నివసించే గర్భిణులకు రూ.40 వేలు
  • సీనియర్ సిటిజన్ల పింఛన్లను రూ.3,600కు పెంపు

విజన్​ డాక్యుమెంట్​-22' పేరుతో ఉత్తరాఖండ్​లో భాజపా విడుదల చేసిన మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవి.

  • 40 శాతం ఉద్యోగాలు మహిళలతోనే భర్తీ
  • 4 లక్షల ఉద్యోగాల కల్పన
  • టూరిజం పోలీసు వ్యవస్థ ఏర్పాటు
  • వంట గ్యాస్ సిలిండర్‌ ధర రూ.500కే పరిమితం

ఉత్తరాఖండ్‌ స్వాభిమాన్‌ ప్రతిజ్ఞ పత్ర' పేరుతో కాంగ్రెస్​ ప్రకటించిన మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇవి.

Uttarakhand assembly election: ఎత్తైన మంచుకొండలు.. హిమనీనదాలకు నెలవైన దేవభూమి ఉత్తరాఖండ్​లో అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరుకుంది. ఈ నెల 14వ తేదీన పోలింగ్​ జరగనుండగా.. 12వ తేదీతో ప్రచార పర్వానికి తెరపడనుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్​- భాజపా మధ్య పోటీ ఉండగా.. ఈసారి తనదైన ముద్ర వేసేందుకు ఆప్​ సిద్ధమైంది. ఈ క్రమంలో ఇన్నాళ్లు.. నోటి మాటగా చెప్పిన హామీలను ప్రధాన పక్షాలు.. మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ఓటరు మహాశయులు ఎవరిని ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ఎన్నికల్లో మేనిఫెస్టో మాత్రమే ప్రభావం చూపదని, స్థానికంగా ఉండే అనేక అంశాలు గెలుపోటములను ప్రభావితం చేస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఉత్తరాఖండ్‌లో అక్షరాస్యత రేటు అధికం. రాష్ట్రంలో విద్యావంతులైన ఓటర్లకు శాసనసభ ఎన్నికలను ప్రభావితం చేయగలిగే శక్తి ఉంది. అందుకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తిరిగి పవర్​లోకి రాలేకపోయింది. దీన్నే అదునుగా చేసుకొని అధికారంలోకి రావాలని చూస్తోంది కాంగ్రెస్​. మళ్లీ విజయం సాధించి.. చరిత్రలో నిలిచిపోవాలని చూస్తోంది భాజపా.

సీఎంల మార్పుతో నష్టమా? లాభమా?

ఉత్తరాఖండ్​లో ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చింది భాజపా. అయితే ఈ సీఎం మార్పుపై ఉత్తరాఖండ్​లో రాజకీయ ఛలోక్తి ఒకటి ప్రాచుర్యంలో ఉంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్​ హోస్ట్​గా వ్యవహరించే.. కౌన్​బనేగా కరోడ్​పతి కార్యక్రమంలో ప్రశ్న అడిగే లోపు ఉత్తరాఖండ్​లో సీఎం మారిపోతారనే జోక్​ అక్కడ ట్రెండింగ్​లో ఉంది. ప్రత్యర్థులు దీన్ని ఆసరాగా చేసుకొని భాజపాపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

2017లో ఎన్నికల్లో భాజపా 57 స్థానాల్లో అఖండ విజయం సాధించిన తర్వాత త్రివేంద్రసింగ్‌ రావత్‌ సీఎంగా నియమితులయ్యారు. పార్టీలో అసంతృప్తి నేపథ్యంలో భాజపా నాలుగేళ్ల తర్వాత తీరథ్‌ సింగ్‌ రావత్‌కు పీఠాన్ని అప్పగించింది. నాలుగు నెలల వ్యవధిలోనే కొత్త సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ధామీని నియమించింది. అయితే సీఎంల మార్పు ఎన్నికల్లో భాజపా విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్​కు కూడా ప్రతికూల అంశాలు లేకపోలేదు. భాజపాకు మోదీ లాంటి ఇమేజ్​ ఉన్న నాయకుడు ఉండగా.. కాంగ్రెస్​కు ఆ స్థాయిలో బలమైన నేత లేరు. జాతీయ స్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడం పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి. రాష్ట్రంలో హరీశ్​ రావత్​ నాయకత్వంలో పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన రెండు స్థానాల్లోనూ హరీశ్‌ రావత్‌ పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో ఆయనపై పార్టీలో కొంత వ్యతిరేకత ఉంది.

రెబల్స్​ తంటా..

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా- కాంగ్రెస్​ను రెబల్స్​ బెడద తీవ్రంగా వేధిస్తోంది. హస్తం పార్టీకి దాదాపు తొమ్మిది స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు సవాల్‌ విసురుతున్నారు. అయితే భాజపాకు ఏకంగా పన్నెండు స్థానాల్లో రెబల్స్​ నుంచి ప్రమాదం పొంచి ఉంది.

మొత్త 70అసెంబ్లీ స్థానాల్లో 20 చోట్లకు పైగా రెబల్​ అభ్యర్థులు తీవ్ర దెబ్బకొట్టే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే.. గెలుపు తారుమారు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మతాల ప్రాబల్యం తక్కువే..

ఉత్తరాఖండ్​లో కుల, మతాల ప్రాబల్యం యూపీ అంత బలంగా ఉండదనే చెప్పాలి. ఏమైనా పోటీ ఉంటుందంటే.. ఠాకూర్‌లు, బ్రాహ్మణుల మధ్యే. రాష్ట్ర రాజకీయాలను కూడా ఈ రెండు వర్గాలే శాసిస్తూ వస్తున్నాయి.

ఠాకూర్లలో మంచి పేరున్న భక్త్‌ దర్శన్‌ 1952 నుంచి 1970 వరకు రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ఆ తర్వాత ప్రతాప్‌ సింగ్‌ నేగి, చంద్ర మోహన్‌ సింగ్‌ నేగి ఒక వెలుగు వెలిగారు. బ్రాహ్మణ నేతలు జగన్నాథ్‌ శర్మ, కాంగ్రెస్‌ నేత హేమ్‌వతి నందన్‌ బహుగుణ రాష్ట్ర రాజకీయాల్లో చక్ర తిప్పారు.

అయితే ఉత్తరాఖండ్‌లో ముస్లింల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల మతపరమైన పోలరైజేషన్​కు ఇక్కడ అవకాశం తక్కువనే చెప్పాలి. అభివృద్ధి అజెండాతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి ప్రధాన పక్షాలు.

ఉత్తరాఖండ్‌లో మాజీ సైనికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కొన్ని స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో వారు ఉన్నారు. అందుకే మాజీ సైనికుల సంక్షేమం కోసం వరాల జల్లు కురిపిస్తున్నాయి పార్టీలు.

కేజ్రీవాల్​ ఫ్యాక్టర్..

ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్​ సత్తా చాటి.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, భాజపాను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇప్పుడు అదే ఉత్సాహంతో కేజ్రీవాల్​ ఉత్తరాఖండ్​ కోసం ప్రణాళికలు రచించారు. 18 ఏళ్లు పైబడిన యువతులకు ప్రతి నెలా రూ.1000, ఉత్తరాఖండ్‌ను అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి, ఉద్యోగాల హామీ, అయోధ్య, అజ్మీర్ షరీఫ్ లాంటి పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు ఉచితంగా ఏర్పాట్లు.. లాంటి హామీలతో ఉత్తరాఖండ్ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రీవాల్​.

ఆప్​కు ఒకవేళ ఓటింగ్​ శాతం పెరిగితే.. ప్రధాన పార్టీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది.

ఆరు వేల ఓట్లు పడితే ఎమ్మెల్యే..

ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కూడా విచిత్రంగా ఉంటుందనే చెప్పాలి. ఇక్కడ వందల సంఖ్యలో ఓట్లు వచ్చినా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 40వేల ఓట్లు వచ్చినా.. ఆ అభ్యర్థి ఎమ్మెల్యే కాకపోవడం.. 6వేల ఓట్లు వచ్చిన వ్యక్తి ఇక్కడ అసెంబ్లీ మెట్లు ఎక్కడం ఇక్కడ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కారణం పర్వత ప్రాంతాల్లో ఓటర్లు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

2017లో ఎన్నికల సమయంలో దెహ్రాదూన్ జిల్లాలోని ధరంపుర్ అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 1,84,569 మంది ఓటర్లు ఉన్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని పురోలా స్థానంలో కేవలం 67,496 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏడు నుంచి 13 వేల ఓట్లు వచ్చినా అభ్యర్థి విజయం సాధిస్తారు. 2002లో రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అల్మోరా జిల్లాలోని భికియాసైన్ స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ ప్రతాప్ బిష్త్ కేవలం 6,759 ఓట్లు సాధించి ఎమ్మెల్యే అయ్యారు. రెండో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి లీలాధర్‌కు 4,549 ఓట్లు వచ్చాయి. దీంతో డాక్టర్ బిష్త్ 2,210 ఓట్లతో విజయం సాధించారు. ప్రతి ఎన్నికల్లో ఇదే తరహా గెలుపులు ఇక్కడ సర్వసాధారణం.

ఈ ముఖ్యమంత్రి అయినా..?

ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో సిట్టింగ్‌ ముఖ్యమంత్రులెవరూ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. 2002 ఎన్నికల్లో నిత్యానంద్‌ స్వామి, 2012లో బి.సి.ఖండూరి, 2017లో హరీశ్‌ రావత్‌కు పరాజయాలు ఎదురయ్యాయి. 2007లో అప్పటి సిట్టింగ్‌ సీఎం ఎన్‌.డి.తివారీ ఎన్నికల బరిలో దిగలేదు. ఈ దఫా ఎలాగైనా విజయం సాధించి సీఎంల పరాజయ పరంపరకు తెరదించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ కృతనిశ్చయంతో ఉన్నారు. 2012, 2017 ఎన్నికల్లో తనకు విజయాన్నందించిన ఖటీమా స్థానం నుంచే ఆయన ఇప్పుడు బరిలో ఉన్నారు.

మోదీనే నమ్ముకున్న భాజపా..

2014, 2017, 2019 ఎన్నికల్లో మోదీ ఇమేజ్​తో భాజపా రాష్ట్రంలో విజయాలను నమోదు చేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 57 సీట్లను భాజపా సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా అదే ప్రధాన వ్యూహంగా నాయకత్వం ముందుకు సాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details