Who Named Site On The Moon :చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువానికి సమీపంలో విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని, చంద్రయాన్-2లో ల్యాండర్ శకలాలు ఉన్న చోటుకు తిరంగా పాయింట్ అని ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టిన నేపథ్యంలో అసలు చంద్రునిపై ప్రదేశాలపై పేర్లు ఎలా పెడతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. జాబిల్లిపై ప్రదేశాలకు పేర్లు పెట్టేందుకు అంతర్జాతీయంగా పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. చంద్రునిపై ఇది తమకు చెందిన ప్రదేశం అని చెప్పుకునే హక్కు ఏ దేశానికీ లేదు.
అమెరికా, రష్యా మధ్య ప్రచ్చన్న యుద్ధం సమయంలో ఐక్యరాజ్యసమితి 1966 ఔటర్ స్పేస్ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం చంద్రుడు లేదా ఇతర ఖగోళ వస్తువులపై- ఏ దేశం కూడా సార్వభౌమాధికారాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేదు. అన్ని దేశాల ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణను మాత్రం కొనసాగించవచ్చు. ఆ తర్వాత 1979 జాబిల్లి ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం చంద్రునిపై ఏ ప్రదేశం కూడా తమది అని ఏ దేశంగాని, సంస్థ లేదా వ్యక్తిగాని చెప్పడానికి వీలు లేదు. జాబిల్లిపై వివిధ దేశాలు పరిశోధనలు నిర్వహించకోవచ్చుగానీ చంద్రుడు తమకే సొంతం అని చెప్పడానికి వీలు లేదు. ఒక దేశం తమ జెండాను చంద్రునిపై పాతే అవకాశం ఉంది కానీ తద్వారా ఆ ప్రాంతం తమది అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.
చంద్రునిపై ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి మాత్రం ఇంకా ఎలాంటి చట్టాలు లేవు. అయితే.. చంద్రునిపై ప్రదేశాలకు పేర్లు పెట్టడం 17వ శతాబ్దంలో ఐరోపాలో, 20వ శతాబ్దంలో అమెరికా, సోవియట్ యూనియన్లలో ప్రారంభమైంది. అంతరిక్ష కార్యకలాపాల కోసం 1919లో ఏర్పడిన అంతర్జాతీయ ఖగోళ సంఘం IAU ఇందుకోసం కొన్ని నిబంధనలు రూపొందించింది. IAUలో 92 దేశాలు ఉండగా అందులో భారత్ కూడా ఒకటి. గ్రహ, ఉపగ్రహ నామకరణానికి IAU మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. తమ తమ లూనార్ మిషన్లలో భాగంగా అనేక దేశాలు చంద్రునిపై ప్రదేశాలకు అనధికార పేర్లు పెడుతుంటాయి. అపోలో మిషన్ల సందర్భంగా కూడా అమెరికా కూడా జాబిల్లిపై కొన్ని ప్రదేశాలకు అనధికార పేర్లను పెట్టింది. చైనా కూడా 2010 నుంచి ఇలా పేర్లు పెట్టడం ప్రారంభించింది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం సహా గ్రహాన్వేషణల వల్ల చంద్రునిపై బిలాలు, పర్వతాలు వంటి కొన్ని ప్రదేశాలకు శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పేర్లు పెడుతూ వస్తున్నారు. ఆ తర్వాత వాటిని IAU అనుమతి కోసం పంపుతారు.
అపోలో మిషన్ల సందర్భంగా అమెరికా చంద్రునిపై కొన్ని ప్రదేశాలకు పెట్టిన అనధికార పేర్లను IAU ఆమోదించి వాటికి అధికార హోదా ఇచ్చింది. చంద్రునిపైకి చైనా స్పేస్‌క్రాఫ్ట్ చాంగ్‌యీ-5 వెళ్లిన సందర్భంగా జాబిల్లిపై ప్రదేశాలకు చైనా పెట్టిన 8 పేర్లకు కూడా IAU ఆమోద ముద్ర వేసింది. చంద్రునిపై IAU పేర్లు పెట్టినా వాటిని అంతర్జాతీయ చట్టాల ద్వారా అమలు చేసేందుకు వీలు ఉండదు. అయినప్పటికీ ఖగోళ వస్తువులకు పేర్లు పెట్టడంలో కొన్ని సంప్రదాయాలను పాటిస్తున్నారు.