Rana Couple: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం 'మాతోశ్రీ' ముందు హనుమాన్ చాలీసా పఠించి తీరుతామంటూ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణా వార్తల్లో నిలిచారు. దాంతో శివసేన కార్యకర్తలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. మాతోశ్రీతో పాటు రాణా దంపతుల నివాసం ముందు భారీ ఎత్తున గుమిగూడారు. ఈ జంట వెనక్కి తగ్గడం వల్ల ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినా.. వీరి పేర్లు మాత్రం మార్మోగిపోయాయి. అసలు వీళ్లు ఎవరు..?
రవి రాణా, నవనీత్ కౌర్ భార్యభర్తలు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన స్వతంత్ర చట్టసభ సభ్యులు. రవి.. అక్కడి బద్నేరా నుంచి మూడుసార్లు(2009, 2014, 2019) ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనది అమరావతిలోని శంకర్‌నగర్. బీకాం డిగ్రీ చదివారు. దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారు. అలాగే 2019లో రాష్ట్రంలో తిరిగి భాజపాను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తనవంతు ప్రయత్నించి, విజయం సాధించలేకపోయారు.
నవనీత్ కౌర్.. పంజాబ్‌కు చెందినవారు. కానీ ఆమె కుటుంబం మొదట్నుంచి ముంబయిలోనే ఉండేది. విద్యాభ్యాసం తర్వాత ఆమె మోడలింగ్ రంగంలోకి వచ్చారు. అనంతరం కథానాయికగా తెలుగు తెరపై మెరిశారు. టాలీవుడ్‌లో ఆమె నటించిన సినిమాల్లో 'శీను వాసంతి లక్ష్మి' కూడా ఒకటి. పంజాబీ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. వీరి పరిచయం యోగాగురువు రామ్‌దేవ్ బాబా నిర్వహించే యోగా శిబిరంలోనే జరిగిందని చెప్తారు. రామ్‌దేవ్ ఆశీర్వాదంతోనే ఈ జంట.. 2011, ఫిబ్రవరి 3న నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. 2019 అమరావతి నుంచి ఎంపీగా ఎన్నికైన నవనీత్.. మొదటిసారి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్ సహకారంతో శివసేన కీలక నేత ఆనంద్ అద్సుల్‌పై విజయం సాధించి, వార్తల్లో నిలిచారు. ఇక ఈ దంపతులు యువ స్వాభిమాన్ పార్టీని నడుపుతున్నారు.
తాజా వివాదానికి కారణమేంటంటే..?:రాష్ట్ర సంక్షేమం కోసం హనుమాన్ జయంతి రోజున ముఖ్యమంత్రి హనుమాన్ చాలీసా పఠించాలని తాము కోరామని, కానీ ఆయన ఆ విషయం పట్టించుకోలేదని రవిరాణా వెల్లడించారు. అందుకే తామే ఠాక్రే నివాసం వద్దకు చేరుకొని హనుమాన్ చాలీసాను చదువుతామని ప్రకటించారు. ఇది శివసేన కార్యకర్తల ఆగ్రహానికి దారితీసింది. వారు రాణా ఇంటి ముందు నిరసనలు చేపట్టారు. దీంతో ఠాక్రేపై రాణా విమర్శలు చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఆచరించిన సిద్ధాంతాల నుంచి ఉద్ధవ్ ఠాక్రే తప్పుకున్నారని విమర్శించారు. ఇది మునుపటి శివసేన కాదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే నిరసనకారులు తమ ఇంటిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ రోజు సాగిన అనేక నాటకీయ పరిణామాల అనంతరం రాణా దంపతులు వెనక్కి తగ్గారు. అందుకు మోదీ పర్యటనను కారణంగా చూపారు.
'నేను, రవి రాణా మాతోశ్రీ వద్దకు చేరులేకపోయినా.. సీఎం ఇంటి ముందు గుమిగూడిన భక్తులు మా పని పూర్తిచేశారు. వారు అక్కడ హనుమాన్ చాలీసాను పఠించారు. శివసేన గుండాల పార్టీగా మారిపోయింది. తనకు ఎదురువచ్చిన వారిపై నేరాలు మోపడం, కటకటాల వెనుకకు పంపడమే ఉద్ధవ్ ఠాక్రేకు తెలుసు. ఆయన ఇక్కడ బెంగాల్ తరహా పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు' అంటూ నవనీత్ మీడియా ఎదుట విమర్శలు చేశారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతల నిమిత్తం తాము పోలీసులకు సహకరిస్తామని ప్రకటించారు. ఇక రవి రాణా మాట్లాడుతూ.. రేపు ముంబయికి ప్రధాని మోదీ రానున్నందున తమ నిరసనపై వెనక్కి తగ్గుతున్నామని చెప్పారు. దీని వల్ల ప్రధాని పర్యటనకు ఆటంకం కలగకూడదని వెల్లడించారు. రేపు మోదీ ముంబయిలో జరిగే మాస్టర్ దీననాథ్ మంగేష్కర్ అవార్డుల కార్యక్రమానికి హాజరుకానున్నారు. అక్కడ ఆయన తొలి ‘లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు'ను తీసుకోనున్నారు.
ఇదీ చూడండి:హనుమాన్ చాలీసా సవాల్.. ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల అరెస్ట్
'ఆ సమయంలో లౌడ్స్పీకర్లలో హనుమాన్ చాలీసా బంద్'