కేరళలో మొదటి తరం సీపీఎం నాయకుడు అచ్యుతానందన్ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని పినరయి విజయన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఇద్దరూ లేని పార్టీని రాష్ట్రంలో ఊహించడం కష్టం.
మరి కేరళలో సీపీఎంకు భవిష్యత్‌లో ఎవరు నాయకత్వం వహించాలి?
ప్రస్తుతం పార్టీ శ్రేణులు, నాయకులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సీపీఎం వద్ద జవాబు ఉన్నట్టే కనిపిస్తోంది. బంగాల్ నేర్పిన గుణపాఠమే ఇందుకు మూలమని తెలుస్తోంది.
బంగాల్ ఏం నేర్పింది?
33 ఏళ్ల పాటు బంగాల్‌ను సీపీఎం ఏకధాటిగా పాలించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టంగా మారింది. మమతా బెనర్జీకి దీటైన నాయకుడు లేక.. చివరకు కనుమరుగయ్యే దుస్థితికి చేరుకుంది. దీనికి కారణం నాయకత్వ లోపం. బుద్ధదేవ్ భట్టాచార్య తర్వాత ఆ స్థాయిలో తదుపరి నాయకత్వాన్ని తయారు చేయలేకపోవడం వల్ల పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది.
బంగాల్ నేర్పిన పాఠాన్ని అర్థం చేసుకుని.. భవిష్యత్ ప్రణాళికలను పకడ్బందీగా రచించుకుంటోంది కేరళ సీపీఎం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం పినరయి విజయన్ 2.0 మంత్రివర్గ కూర్పే దీన్ని స్పష్టం చేస్తోంది. తాజా కేబినెట్లో ముఖ్యమంత్రి తప్ప.. మంత్రులందరూ కొత్తవారే కావడం గమనార్హం.
అప్పటి నుంచే...
స్థానిక సంస్థల ఎన్నికల నుంచే యువతకు పెద్దపీట వేయడం మొదలు పెట్టింది సీపీఎం. 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్‌ను తిరువనంతపురానికి మేయర్‌ను చేసింది. కేరళ చరిత్రలో అతి పిన్న వయసు గల కౌన్సిలర్ ఆమెనే.
శాసనసభ ఎన్నికల విషయంలోనూ ఇంతే. థామస్ ఐసాక్, జి.సుధాకరన్ వంటి మంత్రులకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. వరుసగా రెండుసార్లు గెలిచిన వారినీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచింది. ప్రజాదరణ ఉన్న నేతలను పక్కనబెట్టడంపై పార్టీ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా... దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేసింది. ఇప్పుడు అదే తరహాలో మంత్రివర్గ కూర్పు చేపట్టింది. సీనియర్లు, యువకుల కలయికతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతోంది కేరళలోని సీపీఎం నాయకత్వం.
ఈ నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నా... కేకే శైలజను మంత్రివర్గం నుంచి తప్పించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా నిఫా, కరోనా కట్టడితోపాటు రెండో దఫా పార్టీ విజయం సాధించడానికి ఎంతో కృషి చేసిన ఆమెను ఎంతుకు పక్కన పెట్టారన్నది అందరి ప్రశ్న.