జో బైడెన్.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత. మరో రెండు నెలల్లో శ్వేతసౌధానికి చేరతారు బైడెన్. ఇప్పుడు బైడెన్ పేరు ప్రపంచ దేశాల్లో మారుమోగిపోతోంది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం అంటే మాటలా? మరి ఆ స్థాయి వ్యక్తికి మన భారత దేశంలోని ముంబయితో ఓ ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఈ విషయాన్ని ఆయనే అనేక సందర్భాల్లో వెల్లడించారు. ఇంతకీ ఏంటి ఆ సంబంధం?
ఆ లేఖతో..
1972లో యూఎస్ సెనేటర్‌గా ఎంపికయ్యారు బైడెన్. అత్యంత పిన్నవయసులోనే ఈ పదవి చేపట్టి రికార్డు సృష్టించారు. అయితే ఆ సమయంలో బైడెన్‌ను అభినందిస్తూ ముంబయి నుంచి ఓ లేఖ వచ్చిందట. అది పంపిన వ్యక్తి పేరు చివరన బైడెన్ ఉండటం విశేషం. అంతేకాదు 'ముంబయి బైడెన్' పంపిన లేఖలో డెలావేర్ సెనేటర్‌గా బైడెన్ ఎంపికైనందుకు అభినందనలు చెప్తూనే.. ఇద్దరికి సంబంధం ఉందని అందులో పేర్కొన్నారట.
29 ఏళ్ల వయసున్న సెనేటర్ బైడెన్.. ఆ సమయంలోనే లేఖ రాసిన 'ముంబయి బైడెన్'ను కలవాలనుకున్నారట. అయితే కుటుంబం సహా తాను రాజకీయాల్లో బిజీ అవడం వల్ల కుదరలేదని చెప్పారు. ఆ తర్వాత పలు వేదికలపై ఆ స్టోరీలను పంచుకున్నారు.
ఇదీ చూడండి:-'బైడెన్ అనే నేను.. అమెరికన్లను ఒక్కటి చేస్తాను'
స్టోరీలు చెప్తూనే..
భారతీయ-అమెరికన్లు, భారతీయ రాజకీయ నేతలను కలిసిన ప్రతిసారి 'ముంబయి బైడెన్' కథ చెప్తూనే ఉండేవారట జో బైడెన్.
2013, జులై 24న ముంబయిలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజీని అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో సందర్శించారు బైడెన్. ఆ సమయంలో 'ముంబయి బైడెన్' స్టోరీని కార్యక్రమంలోని ప్రేక్షకులతో పంచుకున్నారు.
"భారత్‌లోని ముంబయికి రావడం గౌరవంగా భావిస్తున్నా. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. నాకు బాగా గుర్తుంది. నేను 29 ఏళ్ల వయసులో 1972లో యూఎస్ సెనేట్‌గా ఎంపికయ్యాను. అయితే ఆ సమయంలో ఓ లేఖ అందుకున్నాను. కానీ నేను దాన్ని ఫాలోఅప్ చేయలేకపోయాను. ఎవరైనా వంశావళి గురించి అధ్యయనం చేస్తున్నవారు ఆడియన్స్‌లో ఉంటే నాకోసం వారిని ఫాలో అప్ చేయాలి. బైడెన్ అనే పేరుతో ఆ లేఖ ముంబయి నుంచి వచ్చింది. కచ్చితంగా ఆ వ్యక్తితో నాకు ఏదో అనుబంధం ఉందని అనుకుంటున్నా. 1700 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీ కోసం మా పూర్వీకులు ముంబయికి వచ్చారు."