దేశంలో కరోనా 2.0 ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అత్యవరసరంగా మారింది. అనేక ప్రాంతాల్లో ప్రాణవాయువు సరఫరా లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో 'ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు' ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి.
పనితీరు ఎలా..
తమంతట తాము ఆక్సిజన్ తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందిస్తుంటారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల ప్రాణాలను రక్షించడం కోసం సరైన సమయంలో ప్రాణవాయువు అందించడం అత్యంత కీలకం. సాధారణంగా ఆసుపత్రుల్లో ఇందుకోసం ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగిస్తారు. నాజల్ కాన్యులా లేదా ఆక్సిజన్ మాస్క్‌ల ద్వారా ఈ సిలిండర్ల నుంచి రోగులకు ప్రాణవాయువు అందిస్తారు. అచ్చం ఇలా పనిచేసేవే 'ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు'. చూడటానికి బ్రీఫ్‌కేస్ లేదా వాటర్ ప్యూరిఫయర్ ఆకారంలో ఉంటాయి. అయితే సిలిండర్లలో నిర్ణీత పీడనంతో ఆక్సిజన్ ఉంటే.. కాన్సంట్రేటర్లు మాత్రం మన చుట్టూ ఉన్న గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి గ్రహించి.. దాన్ని ఫిల్టర్ చేసి, గాఢతను పెంచి రోగులకు చేరవేస్తుంటాయి. అందుకే వీటిని కాన్సంట్రేటర్లుగా పిలుస్తారు. బ్యాటరీ లేదా విద్యుత్‌తో ఇవి పనిచేస్తాయి.
ఇదీ చదవండి:'ఆక్సిజన్' కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి
సిలిండర్లకు.. కాన్సంట్రేటర్లకు తేడా ఏంటి?
పనితీరు పరంగా రెండింటి లక్ష్యం ఆక్సిజన్ అందించడమే. అయితే కాన్సంట్రేటర్లలో నిర్ణీత పీడనంలో ఉన్న ఆక్సిజన్ ఉండదు కాబట్టి.. దీనికి బలమైన లోహపు ట్యాంక్ అవసరం లేదు. తేలికైన ప్లాస్టిక్‌తో దీన్ని తయారుచేయడం వల్ల వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. సాధారణంగా ఇంట్లో ఆక్సిజన్ థెరపీ తీసుకునేవాళ్లు వీటిని వినియోగిస్తుంటారు. మరో విశేషమేంటంటే.. గాలి నుంచే ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది గనుక, సిలిండర్ల మాదిరిగా ఇందులో ఎప్పటికీ ఆక్సిజన్ అయిపోదు.
ఇదీ చదవండి:'దిల్లీలో పరిస్థితులు మరింత ఆందోళకరం'