ముందు నుంచి అనుకున్నట్లుగానే ఊహాగానాలను నిజం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత సువేందు అధికారి.. భారతీయ జనతా పార్టీలో చేరారు. మిద్నాపోర్లో జరిగిన భాజపా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఇతర పదవులకు రాజీనామా చేశారు సువేందు.
టీఎంసీపై విమర్శలు
భాజపాలో చేరిన క్రమంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై, సీఎం మమతా బెనర్జీపై విమర్శల వర్షం కురిపించారు. ఆత్మగౌరవానికి రాజీపడే చోట తాను ఉండలేనని, అందుకే టీఎంసీని వీడానని చెప్పారు.
"భాజపాలోకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఈ పార్టీతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. కానీ నన్ను చేరమని ఎవరూ అడగలేదు. రెండు దశాబ్దాల పాటు తృణమూల్‌తో ఉన్నా. కానీ టీఎంసీ నన్ను అవమానించింది. ఆత్మగౌరవానికి రాజీ పడలేను. అందుకే పార్టీని వీడాను. కానీ ఇప్పుడు నన్ను వెన్నుపోటుదారుడిగా టీఎంసీ చిత్రీకరిస్తోంది. మమతా బెనర్జీ ఎవరికీ అమ్మ కాదు. మనందరికీ తల్లి ఆ భరతమాత ఒక్కరే." అని సువేందు చెప్పుకొచ్చారు. తృణమూల్ హయాంలో బంగాల్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమవుతోందని ఆయన ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపు తథ్యమని సువేందు ధీమా వ్యక్తం చేశారు.
10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు..
సువేందుతో పాటు మరో 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు భాజపా గూటికి చేరారు. ఎమ్మెల్యేల్లో తపసి మండల్, అశోక్ దిండా, సుదీప్ ముఖర్జీ, సాయ్కత్ పంజా, శిలభద్ర దత్తా, దీపాలి బిశ్వాస్, సుక్రా ముండా, బిస్వజిత్ కుండు, బనశ్రీ మైతి ఉన్నారు. వారితో పాటు శ్యామపాద ముఖర్జీ, ఎంపీ సునిల్ మండల్, మాజీ ఎంపీ భాజపాలో చేరారు.
ఇదీ చూడండి: '21 రోజుల్లో కరోనాపై విజయం' మాయమాటలే: రాహుల్