కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్ విధిస్తున్నట్టు బంగాల్ ప్రభుత్వం వెల్లడించింది. షాపింగ్ కాంప్లెక్స్‌లు, బ్యూటీ పార్లర్లు, సినిమా థియేటర్లు, క్రీడా సంబంధిత ప్రదేశాలు, స్పాలు మూసివేస్తున్నట్టు తెలిపింది. మార్కెట్లు 5 గంటల పాటు(ఉదయం 7 నుంచి 10 గంటల వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించింది. రెస్టారెంట్లు, బార్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేయాలని ఆదేశించింది. హోం డెలివరీ, ఆన్‌లైన్ సేవలను అనుమతించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టంచేసింది.
అన్ని సామాజిక, సాంస్కృతిక, వినోద, విద్యా సంబంధమైన సమావేశాలను నిషేధించింది ప్రభుత్వం. ఔషధ దుకాణాలు, వైద్య సంబంధిత పరికరాలు, నిత్యావసర సరకుల విక్రయాలకు ఈ పాక్షిక లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.