బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ విషయంపై కేంద్ర ప్రభుత్వం, దీదీ సర్కార్ మధ్య వివాదం కొనసాగుతోంది. బంధోపాధ్యాయ్ను రిలీవ్ చేయాలని, ఆయన దిల్లీలో సోమవారం రిపోర్ట్ చేయాలని ఆదేశించింది కేంద్రం. అయితే బంధోపాధ్యాయ్.. దిల్లీలో సోమవారం రిపోర్ట్ చేయటం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్త్ బ్లాక్‌లో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) ఇచ్చిన నోటిఫికేషన్‌ను పక్కనపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి.
కేంద్రం ఆదేశించినప్పటికీ.. బంధోపాధ్యాయ్ను బంగాల్ ప్రభుత్వం ఇప్పటికీ రిలీవ్ చేయలేదు. సోమవారమే సీఎస్‌గా బంధోపాధ్యాయ్ చివరి పనిదినం కావటం గమనార్హం. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. కేంద్ర అనుమతించింది. అయితే.. అందుకు బంధోపాధ్యాయ్ అంగీకరించాల్సి ఉంది.
సోమవారం అత్యవసర భేటీ..
దిల్లీలో బంగాల్ సీఎస్ రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించిన సమయంలోనే.. యాస్ తుపానుపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. రాష్ట్ర సచివాలయం నబాన్నలో జరిగే భేటీకి సీఎస్ ఆలాపన్ బంధోపాధ్యాయ్ హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర డిప్యూటేషన్‌కు బంధోపాధ్యాయ్ను రిలీవ్ చేసే అవకాశాలు లేవని పేర్కొన్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఏకపక్షంగా బదిలీ కుదరదు..!
బంగాల్ సీఎస్ ఆలాపన్ బంధోపాధ్యాయ్ పదవీ విరమణ రోజునే కేంద్రం మరోమారు డిప్యుటేషన్‌కు ఆదేశించే అవకాశం ఉందని మాజీ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసేందుకు నిరాకరించే అవకాశం ఉన్నందున దానిని అమలు చేయటం కేంద్రానికి క్లిష్టంగా మారొచ్చని పేర్కొన్నారు. ఆలాంటి బదిలీలను తిరస్కరించే ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌ను సూచిస్తూ కేంద్రానికి రాష్ట్రం సమాధానం ఇచ్చే అవకాశం ఉందన్నారు కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి జవహార్ సిర్కార్. ఏకపక్షంగా ఐఏఎస్, ఐపీఎస్‌ను బదిలీ చేయటం కేంద్రానికి అంత సులభం కాదన్నారు. ఈ విషయంలో బంగాల్ ప్రభుత్వం లేదా బంధోపాధ్యాయ్ అంగీకారం అవసరం ఉంటుదని కానీ, అలా చేయలేదని గుర్తు చేశారు.
ఇదీ చూడండి:సీఎస్ కోసం మోదీ, దీదీ ప్రభుత్వాల పేచీ!