తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన తల్లీకూతుర్లు అరుదైన ఘనత సాధించారు. తిరుచ్చిలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల విభాగంలో తల్లి మసిలమణి బంగారు పతకం సాధించగా.. 47 కిలోల విభాగంలో ఆమె కుమార్తె ధరణి కాంస్య పతకంతో మెరిసింది.
జిమ్‌లో కొందరు వెయిట్ లిఫ్టింగ్ చేయడం చూసి.. మసిలమణికి వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి కలిగింది. ఈ విషయం జిమ్ ట్రైనర్ శివకుమార్ గమనించాడు. దీంతో ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఆయన ముందుకొచ్చాడు. మసిలమణి జిమ్ చేయడం చూసి.. ఆమె కుమార్తె ధరణికి వెయిట్ లిఫ్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ వచ్చింది. కుమార్తె ఆసక్తిని గమనించిన మసిలమణి.. ఆమెను ప్రోత్సహించింది. ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా తనతోపాటు వెయిట్ లిఫ్టింగ్ శిక్షణకు తీసుకెళ్లింది. జిమ్ ట్రైనర్ శివకుమార్.. ధరణికి కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించాడు.
అలా మసిలమణి, ధరణిలు బాగా శిక్షణ తీసుకుని.. తిరుచ్చిలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. కొద్దిరోజుల క్రితమే ధరణి.. చెన్నైలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకంతో మెరిసింది.