Army Chief warning to China: లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా ఆర్మీని భారత సైన్యం సమర్థంగా ఎదుర్కొంటోందని అన్నారు సైనికాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం. నరవణే. ఆ ప్రాంతంలో అత్యున్నత స్థాయి కార్యాచరణ సంసిద్ధతను కొనసాగిస్తున్నామని తెలిపారు. జనవరి 15 'ఆర్మీ డే' కు ముందు.. మీడియాతో మాడ్లాడిన ఆర్మీ చీఫ్ చైనాతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నట్లు వివరించారు.
యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై మండిపడ్డ నరవణే.. డ్రాగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తే భారత బలగాల ప్రతిస్పందన చాలా బలంగా ఉంటుందని హెచ్చరించారు. చైనా విసిరే ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి.. సర్వ సన్నద్ధంగా ఉన్నామన్నారు.
డిసెంబర్ 4 నాగాలాండ్ కాల్పుల ఘటనపై విచారణ నివేదిక త్వరలో వెలువడనుందన్న ఆర్మీ చీఫ్.. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పశ్చిమ సరిహద్దులో ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ముష్కరులు పదేపదే చొరబాట్లకు యత్నిస్తున్నారని వెల్లడించారు.