నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు అధికారి సమీర్ వాంఖడేపై పదునైన విమర్శలు చేస్తూ వస్తున్న మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వాటి జోరు మరింత పెంచారు. బెదిరింపుల ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించిన సమీర్.. ఖరీదైన జీవితం గడుపుతారని ఆరోపించారు. సమీర్ రూ.లక్ష విలువైన ప్యాంటు, రూ.70వేల విలువైన చొక్కా, 25లక్షల నుంచి 50 లక్షల రూపాయల విలువైన చేతి గడియారం ధరిస్తారని అన్నారు. నిజాయితీ గల అధికారులు అంత విలువైన వాటిని ఎలా ధరించగలరని నవాబ్ మాలిక్ ప్రశ్నించారు. వ్యక్తులను తప్పుడు కేసుల్లో ఇరికించి బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు సమీర్ వాంఖడే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలను సమీర్ వాంఖడే ఖండించారు. తాను ఖరీదైన దుస్తులు ధరించలేదని, ఈ విషయాలపై సరైన అవగాహన లేకే మంత్రి ఇలా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.