wake fit india : రియాల్టీ షోలకు బాస్‌గా నిలుస్తున్న బిగ్‌బాస్ అంటే ఆసక్తి ఉందని వారంటూ ఉండరూ. దాదాపు 100 రోజుల పాటు ఒక ఇంట్లో బందీగా ఉండే కంటెస్టెంట్లు వివిధ టాస్కులు చేసి ఆఖరి మెట్టుకు చేరుకుంటారు. అదే తరహా షోకు మనల్ని ఆహ్వానిస్తే.. ఎటువంటి టాస్కులు చేయకుండా, కేవలం నిద్రపోతే చాలు.. అక్షరాల పది లక్షలు వరిస్తాయంటే..? అలాంటి ఆఫర్‌ను ఎవరు కాదంటారు? ఇలాంటి విన్నూత్న ఆఫర్‌కు బీజం వేసింది 'వేక్ ఫిట్' అనే ఓ సంస్థ.
తాము తయారు చేసిన పరుపుల మార్కెటింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది వేక్ ఫిట్ సంస్థ. మూడేళ్ల క్రితం ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్‌ను ఆవిష్కరించింది. ఏటా నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఎంతో మంది దరఖాస్తు చేసుకుంటారు. అందులో 15 మందిని ఫైనలైజ్ చేసి వారి మధ్య పోటీ నిర్వహిస్తారు. వీళ్లు చేయాల్సిందల్లా ఆ సంస్థ ఇచ్చిన పరుపుపై 100 రోజుల పాటు 9 గంటల సేపు కంటి నిండా కునుకు తీయడం. దీని కోసం వారికి లక్ష రూపాయల స్టైపెండ్‌ను అందజేస్తుంది సంస్థ.
కంటెస్టెంట్స్ ఎంత సేపు పడుకున్నారు అనే విషయాన్ని స్లీప్ ట్రాకర్ అనే డివైజ్ ట్రాక్ చేస్తుంది. అలా నిద్రపోయిన టాప్ 4 కంటెస్టెంట్స్‌ను ఫైనల్స్‌కు పంపిస్తారు. ఆఖరున వారిలో ఒక్కరినే స్లీపింగ్ కింగ్ లేకుంటే క్వీన్‌గా ఎన్నుకుంటారు. సెలబ్రిటీలు సైతం ఈ కాంపిటిషన్ గురించి తమ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఉన్నారు. అంతే కాకుండా ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కూడా తనే.