తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రవాసుల హక్కుకు మన్నన దక్కేదెలా? - భారతదేశ ప్రజాస్వామ్యం

ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తును, పౌరుల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో- ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించకపోయినా.. రాజ్యాంగం నిర్మించిన చట్ట సభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు పౌరులకు ఉంది. ఈ క్రమంలో ప్రవాస భారతీయులకు, ఇతర కారణాల వల్ల తమ నియోజక వర్గాల వెలుపల ఉంటున్నవారికి ఓటు వేసే హక్కు కల్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

Voting for NRIs is a must in India, the largest democracy
ప్రవాసుల హక్కుకు ఇ-తపాలా ఓటింగ్‌ అత్యావశ్యకం

By

Published : Mar 20, 2021, 6:43 AM IST

ప్రజల అభీష్టంతోనే ప్రభుత్వాలు అధికారం చలాయించగలుగుతాయని 1948నాటి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన ఉద్ఘాటించింది. జనం అభిమతమేమిటో నిర్దిష్ట కాలావధిలో జరిగే ఎన్నికల్లో వారి ఓటింగ్‌ ద్వారా తేలిపోతుంది. ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తును, పౌరుల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో- ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించకపోయినా, ఈ దేశంలో రాజ్యాంగం నిర్మించిన చట్ట సభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు పౌరులకు ఉందని వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు స్పష్టం చేశాయి. ఇక్కడ లింగ, కుల, జాతి, మత భేదాలు లేకుండా పౌరులందరికీ ఓటు వేసే హక్కు ఉంది. నేడు ఈ దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికీ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, అధికారం ఉన్నాయి. దురదృష్టవశాత్తు గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినందువల్ల నేటి ఎన్నికల్లో ప్రజాభీష్టం కచ్చితంగా ప్రతిఫలిస్తోందని చెప్పలేకపోతున్నాం.


నేతల్లో కొరవడిన దార్శనికత
ఒకప్పుడు సిద్ధాంతాలు, రాజకీయ పార్టీల అజెండాలు, ఎన్నికల ప్రణాళికలు, రాజకీయ నాయకులు, అభ్యర్థుల గుణగణాలకు ఓటర్లు విలువిచ్చేవారు. ఇటీవలి దశాబ్దాల్లో కుల, మత, ధన ప్రాబల్యాలు, సబ్సిడీలు ఎన్నికలను ప్రభావితం చేసే శక్తులుగా తయారయ్యాయి. విద్యావంతులకు ఓటు విలువ తెలిసి కూడా పోలింగ్‌లో పాల్గొనకపోవడం, ప్రజాస్వామ్యాన్ని నీరుగారుస్తున్న అత్యంత ప్రమాదకర, విచారకర అంశం. వారు పాలిటిక్స్‌ను పాలిట్రిక్స్‌గా పరిగణిస్తూ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఒరిగేది, మారేది ఏదీ లేదనే నిరాశామయ దృక్పథాన్ని అలవరచుకున్నారు. పట్టణ ఓటర్లు, విద్యావంతులు పోలింగ్‌ పట్ల నిరాసక్తత ప్రదర్శిస్తుంటే, సమాజంలో ఇతర వర్గాలవారు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. కుల, మత, ధన ప్రాబల్యాలు వీరిని ప్రభావితం చేస్తున్నాయి. అందుకే, దార్శనికత కొరవడిన నాయకుల ఆధ్వర్యంలోని రాజకీయ పార్టీలు దేశాన్ని, రాష్ట్రాలను ఏలగలుగుతున్నాయి. ప్రజలకు నిజంగా మేలుచేయగల ప్రభుత్వాలు ఏర్పడలేకపోతున్నాయి.

పాస్​పోర్ట్​ తో ఓటు వేయవచ్చు...
ప్రపంచీకరణ వల్ల లక్షలాది భారతీయులు అనేక దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరిలో అత్యధికులకు ఆయా దేశాల పౌరసత్వం లేదు. విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 210 దేశాల్లో మొత్తం 3.2 కోట్లమంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ప్రవాస భారతీయులే కాక, తరాల క్రితం విదేశాలకు వెళ్ళి స్థిరపడిపోయిన భారత సంతతి (పీఐఓ) ప్రజలూ ఉన్నారు. పీఐఓలకు ఆయా దేశాల పౌరసత్వం ఉంటుంది కాబట్టి వారు భారత్‌లో ఓటు వేయడానికి వీల్లేదు. కానీ, ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) ఇంకా భారత పౌరులే కాబట్టి, 1950నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 20ఎ కింద స్వదేశంలో ఓటు వేసే అర్హత ఉంటుంది. దీనికోసం వారు సంబంధిత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆన్‌లైన్‌లో అధికారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పాస్‌పోర్టులో స్వస్థలంగా చూపిన ప్రదేశం ఏ నియోజకవర్గంలో ఉంటే అక్కడ ఓటు వేయవచ్చు. దీనికోసం ముందుగా వారు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయ ఓటర్లు నిర్దేశిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్ళి పాస్‌పోర్ట్‌ చూపించి ఓటు వేయవచ్చు. వారికి ఈపీఐసీ నంబర్‌ ఇవ్వరు.

ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌పై సుప్రీంకు...

ప్రవాస భారతీయులకు, ఇతర కారణాల వల్ల తమ నియోజక వర్గాల వెలుపల ఉంటున్నవారికి ఓటు వేసే హక్కు కల్పించాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. దీనిపై కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఎన్‌ఆర్‌ఐలు, సొంత నియోజక వర్గాలకు వెలుపల ఉంటున్నవారు స్వయంగా వచ్చి ఓటు వేయాలనడం సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా నివసించడానికి, తిరగడానికి, వృత్తి ఉద్యోగాలు చేసుకోవడానికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు ఇది విరుద్ధమని వాదించారు. వీరికి తపాలా ద్వారా ఓటు వేసే హక్కు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కొన్ని వర్గాల ఓటర్లకు మాత్రమే పోస్టల్‌ బ్యాలట్‌ను అనుమతిస్తున్నారు. ప్రభుత్వంతో కలిసి ఎన్నికల సంఘం గుర్తించే వర్గాలకు చెందిన ఓటర్లకు పోస్టల్‌ బ్యాలట్‌ సౌకర్యం కల్పించవచ్చని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 60(సి) సెక్షన్‌ పేర్కొంటున్న సంగతిని పిటిషనర్ల న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సౌకర్యాన్ని ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌కూ వర్తింపజేయాలని కోరారు.


ప్రలోభాలకు దూరంగా...
సైనిక బలగాల్లో, విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి ఎలెక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాలను మంజూరు చేసే సౌకర్యాన్ని 2016లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఓటరు క్యూఆర్‌ కోడ్‌ సాయంతో తన తపాలా ఓటును సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి పంపవచ్చు. ఈ ‘ఎలెక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ (ఈటీపీబీఎస్‌)’ సౌకర్యాన్ని ఎన్‌ఆర్‌ఐలకు, నియోజక వర్గాల వెలుపల ఉన్నవారికి వర్తింపజేయవచ్చు. 2019 ఎన్నికల్లో 10,84,266 ఇ-తపాలా బ్యాలట్లు ఎలెక్ట్రానిక్‌ మార్గంలో అందాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ డిజిటల్‌ యుగంలో ఇ-తపాలా బ్యాలట్‌ సౌకర్యాన్ని ఇతర వర్గాల ఓటర్లకు, ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐ ఓటర్లకు తగు జాగ్రత్తలతో విస్తరించవచ్చు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల పోలింగ్‌ కేంద్రాలకు రాలేనివారికి సైతం ఈ సౌకర్యం కల్పించాలి. ఇ-తపాలా బ్యాలట్‌ విధానం ఎన్నికల్లో కుల, మత, ధన ప్రాబల్యాన్ని తగ్గించడానికి సైతం తోడ్పడుతుంది. ఈటీపీబీఎస్‌ పద్ధతిలో లోపాలకు తావులేకుండా మరింత మెరుగ్గా, పకడ్బందీగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం నడుంకట్టాలి. తక్కువ ఖర్చులో సమర్థంగా నిర్వహించడానికి అనువైన ఈ పద్ధతి ఎన్నికల్లో అవినీతిని ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది. క్రమంగా దేశ ప్రజలందరికీ ఆన్‌లైన్‌ ఓటింగ్‌ సౌకర్యాన్ని విస్తరించడానికి బాటలు వేస్తుంది. ఈటీపీబీఎస్‌ ఓటింగ్‌ విధానం డిజిటల్‌ ఇండియా సాకారంలో ఓ ముఖ్యమైన ముందడుగు అవుతుంది. న్యాయంగా నిష్పాక్షికంగా పోలింగ్‌ జరిగి సజీవ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి పునాది వేస్తుంది.

ప్రత్యేక ఏర్పాట్లేవీ?

దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 91,05,12,091; 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 61,36,57,105 మంది ఓటు వేశారు. ఇది 67.4శాతం పోలింగ్‌ కింద లెక్క. 2014 పోలింగ్‌ కన్నా ఇది 0.96 శాతం ఎక్కువ. అంటే, 2019లో 34శాతం ఓటు హక్కు వినియోగించుకోలేదన్న మాట. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పోలైన ఓట్లు 37.36 శాతమైతే, కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 19.49శాతం. ఓటింగ్‌కు దూరంగా ఉన్న 34 శాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొని ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి. ఓట్లు వేయనివారిలో ప్రవాస భారతీయులూ ఉన్నారు. విద్య, వృత్తి, వ్యాపార, ఉద్యోగాల నిమిత్తం కానీ, వివాహాల వల్ల కానీ వీరు విదేశాల్లో ఉంటున్నారు. విదేశాల్లోని భారతీయులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల వారు పోలింగ్‌లో పాల్గొనలేకపోతున్నారు.

- ప్రొఫెసర్‌ జి.బి.రెడ్డి
(ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర కళాశాల ఆచార్యులు)

ఇదీ చూడండి: బంగాల్​ తొలి దశలో 25% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

ABOUT THE AUTHOR

...view details