తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న వేళ ఆమె ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని, డీఎంకేను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ
21:35 March 03
రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ
"జయలలిత బతికి ఉన్నప్పుడు కూడా నేనెప్పుడూ అధికారంలో లేను. ఆమె మరణానంతరం కూడా ఆ పనిచేయలేదు. నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా. కానీ ఆమె పార్టీ గెలవాలని, వారసత్వం కొనసాగాలని ప్రార్థిస్తున్నా. అన్నాడీఎంకే మద్దతుదారులంతా ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేను ఓడించేందుకు కలిసి పనిచేయాలి. జయలలిత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేయాలని పార్టీ క్యాడర్‌ను కోరుతున్నా"
-వీకే శశికళ, అన్నాడీఎంకే నేత
అక్రమాస్తుల కేసులో అరెస్టైన శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకొని జనవరిలో విడుదలై తమిళనాడులో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ విడుదలతో అందరి దృష్టి ఆమెపైనే నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా మరో ఆరేళ్లు నిషేధం ఉండటంతో ఆమె ఎవరికి మద్దతు ఇస్తారోననే ఉత్కంఠ నెలకొంది. పైగా తనని పార్టీ నుంచి సస్పెండ్ చేసి తన సీఎం కోరికకు అడ్డుతగిలిన పళనిస్వామి, పన్నీర్ సెల్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? తన మేనల్లుడు దినకరన్ స్థాపించిన కొత్త పార్టీలోకి వెళ్తారోనన్న చర్చ కొనసాగుతూ వచ్చింది. అంతేకాకుండా అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు కోసం, తన పదవి కోసం కూడా ఆమె పోరాటం చేశారు. ఈసీకి, కోర్టులో ఫిర్యాదు చేశారు కూడా. ఈ తరుణంలో ఆమె పూర్తిగా రాజకీయాలకే గుడ్ బై చెప్పడం గమనార్హం.