Viral rapper Sania Mistry: పేదరికం తన కళకు అడ్డు అనుకోలేదు ఆ అమ్మాయి. తనున్న జీవన పరిస్థితులను చూసి నిరుత్సాహపడలేదు. తన పేదరికం, మురికివాడలు, జీవన పరిస్థితులనే ఇతివృత్తాలుగా ఎంచుకుని ర్యాప్ సాంగ్స్ పాడుతోంది ఈ ముంబయి బాలిక. సోషల్ మీడియాలో అంతకంతకూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
Mumbai Rap Singer News: సానియా మిస్త్రీ సోషల్ మీడియాలో పాపులర్ ర్యాపర్. తన ర్యాప్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించగలదు. ముంబయి శివాజీ నగర్‌లోని ఓ ఇరుకైన వీధిలో.. చిన్న ఇంట్లో తన తల్లిదండ్రులతో ఉంటోంది. తండ్రి ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సానియా వయసు ప్రస్తుతం 15 ఏళ్లు. అంబేడ్కర్ కాలేజీలో చదువుకుంటోంది.
చిన్నప్పటి నుంచే ఏదైనా రంగంలో గొప్పగా రాణించాలని కలలుగన్న సానియా.. తన ర్యాప్ కళకు పదును పెట్టింది. మురికివాడల్లో జీవించే వారి స్థితిగతులను ర్యాప్ సాంగ్స్ ద్వారా ప్రపంచానికి వివరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలను పోస్టు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
" నా కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులనే పాటలుగా మలిచాను. ప్రస్తుతం ర్యాప్ పాటలు పాడుతూనే చదువును కొనసాగిస్తున్నాను. భవిష్యత్‌లో ర్యాప్‌ను ఇలాగే కొనసాగిస్తాను."