విజయ్ రామ్నిక్లాల్ రూపానీ (Vijay Rupani News).. మయన్మార్‌లోని రంగూన్ పట్టణంలో 1956 ఆగస్టు 2న జైన కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆరెస్సెస్‌కు చెందిన ఓ విభాగంలో చేరారు. ఆ తర్వాత ఏబీవీపీలో పనిచేశారు. అనంతరం భాజపాలోకి వచ్చారు. న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించారు.
అవినీతి, ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా 1974లో విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు చేసిన గుజరాత్ నవనిర్మాణ్ ఉద్యమంలో (Gujarat Navnirman Andolan) రూపానీ కీలకంగా వ్యవహరించారు. దీని ద్వారా తన రాజకీయ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఏబీవీపీలో ఉన్న ఆయన.. సుమారు ఏడాది పాటు జైలులో గడిపారు. 1996-97లో రాజ్‌కోట్ మేయర్‌గా ప్రజలకు దగ్గరయ్యారు.
భాజపా అధ్యక్షుడిగా..
2006లో గుజరాత్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హెడ్‌గా పనిచేశారు. ఈ సమయంలోనే 'ఖుష్బూ గుజరాత్ కి' అనే ప్రచార కార్యక్రమాన్ని రూపొందించి.. రాష్ట్రంలోని పర్యటక కేంద్రాలకు విశేష ప్రాచుర్యం కల్పించారు.
రాజ్యసభ సభ్యుడిగా..
సీఎం కాకముందు గుజరాత్ భాజపా విభాగంలో వివిధ హోదాల్లో సేవలందించారు. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2014లో రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2016 ఫిబ్రవరి 19న గుజరాత్ భాజపా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.