Venkaiah on MPs suspension:పెద్దల సభ నుంచి 12 మంది సభ్యులను సస్పెండ్ చేయడంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సస్పెన్షన్ను ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎందుకు అభివర్ణిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఇలా సస్పెన్షన్ విధించడం ఇదే తొలిసారి కాదని, 1962 నుంచి 2010 వరకు 11 సార్లు జరిగిందని చెప్పారు. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు.. సస్పెన్షన్ ఎందుకు విధించారన్న కారణాలపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు.
"12 మంది సభ్యులపై సస్పెన్షన్ విధించడాన్ని కొందరు సభ్యులు, నేతలు.. అప్రజాస్వామికంగా అభివర్ణిస్తున్నారు. వారి ప్రచారంలో ఏదైనా వాస్తవికత ఉందేమోనని ఆలోచించా. కానీ నేను అర్థం చేసుకోలేకపోయా. గత ప్రభుత్వాలు సైతం ఇలాంటి సస్పెన్షన్లు విధించాయి. అవన్నీ అప్రజాస్వామికమే అవుతాయా? అలా అయితే.. ఎందుకు అన్ని సార్లు సస్పెన్షన్ విధించారు?"
-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్
Rajya Sabha Members suspended:
గత సమావేశాల్లో సభను అపవిత్రం చేసేలా ప్రవర్తించినందుకే సభ్యులపై వేటు వేసినట్లు వెంకయ్య తెలిపారు. ఈ విషయాన్ని సభలోనూ స్పష్టంగా చెప్పానని తెలిపారు. సభను అపవిత్రం చేసే చర్యను ప్రజాస్వామ్యయుతంగా.. వారిపై వేటు వేయడాన్ని అప్రజాస్వామికంగా ప్రచారం చేయాలని చూడటం దురదృష్టకరమని అన్నారు. అయితే, దేశ ప్రజలు ఇలాంటి కొత్త పోకడలను పరిగణనలోకి తీసుకోరని విశ్వాసం వ్యక్తం చేశారు.