కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలను ఉద్ధృతం చేశారు రైతులు. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీ సమీప సరిహద్దుల్లోని టోల్ ప్లాజాలను మూసివేశారు. ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా వాహనాలను పంపిస్తూ.. నిరసన తెలుపుతున్నారు.
టోల్ ప్లాజాలు మూసివేసి ఆందోళనలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే దిల్లీ-హరియాణా సరిహద్దు కర్నాల్‌లోని బస్తారా టోల్ ప్లాజాను మూసివేసి.. వాహనాలను అనుమతిస్తున్నారు అన్నదాతలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. అలాగే.. అంబాలలోని శంభు టోల్‌ప్లాజాను కూడా మూసివేశారు.
" గత అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ టోల్‌ప్లాజా మూసివేసి వాహనాలకు అనుమతిస్తున్నాం. కొందరు రైతులు వచ్చి మూసివేయాలని కోరారు. అయితే.. ఈ అంశంపై మాకు ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదు. కానీ ఈ నిరసన ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుందని రైతులు తెలిపారు."
- రవి తివారీ, శంభు టోల్‌ప్లాజా ఇంఛార్జీ
శనివారం తెల్లవారుజామునే హిసార్-దిల్లీ ఎన్‌హెచ్-9 రహదారిపై ఉన్న మయ్యడ్ టోల్‌ప్లాజాను మూసివేశారు రైతులు. వాహనాలను ఎలాంటి ఫీజు చెల్లించకుండానే అనుమతిస్తున్నారు. ఈ టోల్‌ప్లాజా పంజాబ్, రాజస్థాన్‌లను దిల్లీతో అనుసంధానిస్తుంది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
టోల్‌ప్లాజా వద్ద భారీగా బలగాల మోహరింపు టోల్‌ప్లాజా వద్ద రైతులు ఆందోళన ఆగ్రాలో సాధారణంగానే..
ఆగ్రా జిల్లాలోని 5 టోల్‌ప్లాజాల్లో సాధారణంగానే రుసుముల వసూలు కొనసాగుతోంది. టోల్‌ప్లాజాలను రైతులు మూసివేసినట్లు తమ దృష్టికి రాలేదని ఆగ్రా జిల్లా ఏఎస్పీ తెలిపారు. అన్నింటిపై నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో ఖందోలి టోల్ ప్లాజా వద్ద సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఖందోలి టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ఆగ్రాలోని ఖందోలి టోల్ ప్లాజా వద్ద సాధారణ పరిస్థితులు దిల్లీ సరిహద్దులకు ప్రయాణం..
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలకు మరింత బలం చేకూరుతోంది. నిరసనల్లో పాల్గొనేందుకు కురుక్షేత్రం నుంచి ట్రాక్టర్లతో దిల్లీకి బయలుదేరారు అన్నదాతలు.
ట్రాక్టర్లలో దిల్లీకి బయలుదేరిన రైతులు దిల్లీకి బయలుదేరిన రైతులు డిసెంబర్ 14న దేశవ్యాప్త ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 14న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు వెల్లడించాయి రైతు సంఘాలు. దిల్లీ, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జిల్లా ప్రధాన కార్యాలయాల ముందు ఒకరోజంతా నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ అదే రోజు నుంచి నిరవధిక నిరసనలు చేస్తున్నట్లు వెల్లడించాయి.
ఇదీ చూడండి: రైతన్నల నిరసనలు ఉద్ధృతం- టోల్‌ప్లాజాల మూసివేత