తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Gyanvapi Carbon Dating : జ్ఞాన్​వాపి మసీదు శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్​ - జ్ఞానవాపి మసీదు వారణాసి కోర్టు

Gyanvapi Carbon Dating : ఉత్తర్​ప్రదేశ్​లోని జ్ఞాన్​వాపి మసీదు కేసులో వారణాసి న్యాయస్థానం కీలక ఆదేశాలు వెలువరించింది. మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది.

Gyanvapi Mosque Case
Gyanvapi Mosque Case

By

Published : Jul 21, 2023, 5:04 PM IST

Updated : Jul 21, 2023, 5:50 PM IST

Gyanvapi Carbon Dating : యూపీలోని ప్రసిద్ధ కాశీవిశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు వారణాసి కోర్టు అనుమతిచ్చింది. మసీదు ప్రాంగణంలో శివలింగం వంటి ఆకారం బయపడిందని.. దీనిపై పురావస్తు శాఖతో సర్వే నిర్వహించాలని హిందూ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. నిజనిర్ధరణకు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అనుమతించాలన్న పిటిషన్‌ను విచారించిన కోర్టు.. జులై 21కి నిర్ణయం వెలువరిస్తామని గతంలో తెలిపింది. శుక్రవారం ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు సర్వే నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. మసీదులోని వాజూఖానా తప్ప.. 3 గుమ్మటాలు, పశ్చిమ గోడ, మిగిలిన ప్రాంగణంలో ASIకి సర్వే నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని హిందూ వర్గంవారు పిటిషన్‌ దాఖలు చేశారు. శాస్త్రీయ నిర్ధరణతోనే దీనికి ముగింపు వస్తుందని కోర్టులో విజ్ఞప్తి చేశారు. ASIని సర్వేకు అనుమతిస్తే మసీదు ప్రాంగణం దెబ్బతింటుందని మరో వర్గం వాదించింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. ASIకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది.

అంతకుముందు జ్ఞాన్​వాపి మసీదులో పూజలకు అనుమతించాలని హిందువులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను.. వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీం కోర్టు. ఉత్తర్​ప్రదేశ్​ న్యాయ విభాగానికి సంబంధించి.. సీనియర్​, అనుభవజ్ఞులైన జ్యుడీషియల్​ అధికారి ఈ కేసును విచారించాలని నిర్ణయం తీసుకుంది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్​ జడ్జ్​ సీనియర్​ డివిజన్​ నుంచి కేసును వారణాసి జిల్లా​ జడ్జికి బదిలీ చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

ఇదీ కేసు
Gyanvapi Shivling found : జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో మే 14 నుంచి 16 వరకు కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది. వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా.. మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించగా.. ఆ ప్రదేశాన్ని సీల్‌ చేయాల్సిందిగా అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం పక్ష నేతలు వాదిస్తున్నారు. జ్ఞాన్​వాపి మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్​కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు ఆ మసీదులో ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.

Last Updated : Jul 21, 2023, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details