vaccination for children in india: చిన్న పిల్లల కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023, జనవరి 1 నాటికి 15 సంవత్సరాలు పూర్తి కానున్న పిల్లలు కూడా 15-18 ఏళ్ల కేటగిరి కింద టీకా తీసుకునేందుకు అర్హులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.
తాజాగా 15 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న వారికి సంబంధించిన వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.. 2007 లేదా అంతకుముందు పుట్టిన పిల్లలందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొంది. అంతేగాకుండా జనవరి 1, 2023 నాటికి 15 ఏళ్లు నిండబోయే వారిని కూడా అర్హులుగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం 2005, 2006, 2007 సంవత్సరాల్లో పుట్టిన పిల్లలందరూ టీకా వేయించుకోవడానికి అర్హులు కానున్నారు.