Uttarakhand assembly election 2022: ఉత్తరాఖండ్‌లో భాజపా చరిత్ర సృష్టించింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అధికారం చేతులు మారే సంప్రదాయానికి చెక్ పెడుతూ.. మెజార్టీ స్థానాలను సునాయాసంగా గెలుచుకుంది. ఫలితాలు హోరాహోరీగా ఉంటాయన్న ఎగ్జిట్ అంచనాలను తలకిందులు చేసింది. కాంగ్రెస్ అనుకున్నంతగా పోటీ ఇవ్వలేకపోయింది.
Uttarakhand election result:
ముఖ్యమంత్రుల మార్పు, ప్రజావ్యతిరేకత వంటి ప్రతికూలతలు ఉన్నా.. ప్రజాదరణ పొందడంలో కమలదళం సఫలమైంది. ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతూ వస్తున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ చరిత్రను తిరగరాసింది. రాష్ట్రంలో ప్రతికూల పవనాలు ఉన్నా.. కేంద్ర అధినాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి.. భాజపాను గెలిపించాయి.
సవాళ్లు ఎన్నో.. అయినా విజయం కమలానిదే..
ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ముఖ్యమంత్రుల మార్పు, అపరిష్కృతంగా ఉన్న స్థానిక సమస్యలు.. దీనికితోడు అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ నేతలు, తొలి జాబితాలో స్థానం కోల్పోయిన ఎమ్మెల్యేలతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికలకు ముందు భాజపాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎలక్షన్లలో ఇవి పార్టీకి ప్రతికూలంగా మారతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, కమలనాథులు వీటన్నింటినీ దాటుకొని విజయం సాధించారు.
BJP Uttarakhand assembly election
సీఎం మార్పులు ఉన్నా..
ఉత్తరాఖండ్‌లో ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చింది భాజపా. 2017లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత త్రివేంద్రసింగ్ రావత్ సీఎంగా నియమితులయ్యారు. పార్టీలో అసంతృప్తి నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత తీరథ్ సింగ్ రావత్‌కు పీఠాన్ని అప్పగించింది భాజపా. నాలుగు నెలల వ్యవధిలోనే కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామీని నియమించింది. ఇవన్నీ, భాజపాకు మైనస్ అవుతాయని విశ్లేషకులు భావించారు. అయితే, ప్రజలు వీటిని పట్టించుకోలేదు.