అమెరికా అధ్యక్షుని ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వాతావరణ మార్పులు, త్వరలో జరగనున్న 40 దేశాల శిఖరాగ్ర సమావేశం తదితర అంశాలపై చర్చించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్లతోనూ జాన్ కెర్రీ మంగళవారం విడివిడిగా సమావేశమయ్యారు.
ప్రధాని మోదీతో జాన్ కెర్రీ భేటీ - వాతావరణ మార్పులపై మోదీ-కెర్రీ
వాతావరణ మార్పుల సంక్షోభానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరులో భారత్ పాత్ర కీలకమని అన్నారు అమెరికా అధ్యక్షుని ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీ. బుధవారం ప్రధాని మోదీతో భేటీ అయిన నేపథ్యంలో ఈ విధంగా ట్వీట్ చేశారు.
ఈ భేటీలపై ట్వీట్ చేసిన కెర్రీ.. వాతావరణ మార్పుల సంక్షోభానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరులో భారత్ పాత్ర కీలకమని చెప్పారు. అందరం కలిసి పనిచేయకపోతే అందరికీ నష్టమేనన్నారు. వాతావరణ మార్పులపై ఈనెల 22 నుంచి జరగనున్న రెండు రోజుల వర్చువల్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ సహా 40 మంది కీలక నేతల్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారు. వ్యాపార ప్రాధాన్యాల్లో మహిళలకు కేంద్రం స్థానం కల్పించాలని జాన్కెర్రీ చెప్పారు. స్త్రీ-పురుష సమానత్వం, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం సహా వాతావరణ సంక్షోభాన్ని కట్టడి చేయడానికి దోహదపడుతుందని తెలిపారు.