ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ డేటా హ్యాక్‌కు గురైంది. డేటా చోరీకి పాల్పడ్డ ఓ వ్యక్తిని అతని మైనర్ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి సహాయం చేసిన మరో ముగ్గురిని సైతం అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు. ప్రభుత్వ అధికారి డేటాను హ్యాక్ చేసిన నిందితులు రూ.80 లక్షలను డిమాండ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ డేటా హ్యాక్.. మైనర్, అతని తండ్రి అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ డేటా హ్యాక్ అయింది. జల్ జీవన్ పథకానికి ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ సైబర్ నేరానికి పాల్పడ్డాడు. నిందితున్ని, అతని మైనర్ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు సాయం చేసిన మరో ముగ్గురిని సైతం అరెస్ట్ చేశారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనురాగ్ శ్రీవాస్తవ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కు ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నారు. సత్యప్రకాశ్ అనే వ్యక్తి జల్ జీవన్ పథకానికి ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా.. ప్రస్తుతం లఖ్‌నవూలోని పార్థ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఒకరోజు సత్యప్రకాశ్.. తన లాప్టాప్లో లోపం తలెత్తిందని శ్రీవాస్తవ నుంచి లాగిన్ పాస్‌వర్డ్‌ను తీసుకున్నాడు. అదే సమయంలో శ్రీవాస్తవ, అతని కుటుంబ సభ్యుల ఈ-మెయిల్ ఐడీలను హ్యాక్ చేశాడు. అనంతరం ఈ మెయిళ్ల ద్వారా వారందరిని బెదిరిస్తూ.. డబ్బులు డిమాండ్ చేశాడు.
డేటా చోరీలో సత్యప్రకాశ్‌కు సహాయం చేసిన అమిత్ ప్రతాప్ సింగ్, రజనీశ్ నిగమ్, హార్దిక్ ఖన్నాలను సైతం అరెస్ట్ చేశారు పోలీసులు. వీరంతా రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. "నిందితులు శ్రీవాస్తవ క్రెడిట్ కార్డునూ హ్యాక్ చేశారు. లఖ్‌నవూలోని వివిధ ప్రాంతాల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోళ్లు చేశారు. సాంకేతిక ఆధారాలు, గ్యాడ్జెట్‌లలోని వివరాలను బట్టి నిందితులను అరెస్ట్ చేశాం" అని సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ముస్లిం ఖాన్ తెలిపారు. ఇంత తక్కువ డబ్బుకు ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేయరేమో అనుకొని తాము భావించామని విచారణలో సత్యప్రకాశ్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.