ఉత్తర్‌ప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎంపీ అఫ్జల్ అన్సారీపై అనర్హత వేటు పడింది. కిడ్నాప్, హత్య కేసుల్లో నాలుగేళ్లు జైలు శిక్షపడటం వల్ల ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సోమవారం లోక్‌సభ సచివాలయం ఉత్తర్వులు జారీచేసింది. 2023 ఏప్రిల్ 29 నుంచి ఇది అమల్లోకి వస్తుందంటూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని అధికరణం 102(1)(ఈ), ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951లోని సెక్షన్ 8 కింద రద్దు నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సచివాలయం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో అఫ్జల్ అన్సారీని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు శనివారం(ఏప్రిల్ 29) దోషిగా తేల్చింది. దీంతో ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, అఫ్జల్ అన్సారీ గాజీపుర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఎందుకు వేటు పడింది?
గాజీపుర్ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య, వారణాసి వ్యాపారి నందకిషోర్ రుంగ్తా కిడ్నాప్, హత్య కేసులో శనివారం యూపీలోని ప్రజాప్రతినిధుల కోర్టు.. గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అన్సారీకి నాలుగేళ్ల పాటు జైలుశిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో మరో నేరస్థుడిగా ఉన్న అన్సారీ సోదరుడితో పాటు నేర చరిత్ర ఉన్న రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీకి కూడా న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్షను విధించింది.
త్వరలోనే ఉప ఎన్నిక!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్ లోక్‌సభ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో అన్సారీ బీఎస్పీ తరఫున ఎంపీగా గెలుపొందారు. 17వ లోక్‌సభ రద్దుకు ఏడాదికి పైగా సమయం ఉండటం వల్ల సాంకేతికంగా గాజీపుర్ లోక్‌సభకు ఉపఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గాజీపుర్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా అనర్హత వేటు పడిన నేపథ్యంలో కేరళలోని వయనాడ్ సహా సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న గిరీశ్ బాపట్(బీజేపీ), సంతోక్ సింగ్(కాంగ్రెస్)ల మరణాలతో పుణె, జలంధర్ లోక్‌సభ సీట్లు కూడా ఖాళీ అయ్యాయి. కాగా, ఇందులో జలంధర్ ఎంపీ స్థానానికి మే 10న ఉపఎన్నిక జరగనుంది.
10 ఏళ్ల వరకు..
ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం అన్సారీ పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెబుతున్నారు. తాజాగా ఆయనకు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. చట్టంలోని నిబంధన ప్రకారం విడుదల సమయం నుంచి ఆరేళ్ల వరకు నిషేధం ఉంటుంది. అయితే పై కోర్టు శిక్షపై స్టే విధిస్తే అనర్హత వేటు తొలగిపోతుంది. హత్యాయత్నం కేసులో ఎన్సీపీ లోక్‌సభ సభ్యుడు మహమ్మద్ ఫైజల్‌కు పడిన పదేళ్ల జైలుశిక్షపై కూడా ఇటీవలే కేరళ హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆయన సభ్యత్వాన్ని ఈ ఏడాది మార్చి 29న లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించింది.
ఇటీవలే రాహుల్‌పై!
2019 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఇంటిపేరును వక్రీకరించారనే కారణంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు నమోదైంది. ఈ కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇటీవలే ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. రాహుల్‌పై కూడా భారత రాజ్యాంగంలోని అధికరణం 102(1)(ఈ), ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951లోని సెక్షన్ 8 కింద రద్దు నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సచివాలయం స్పష్టం చేసింది. దీంతో మార్చి 24న ఆయన కూడా అనర్హత వేటుకు గురై ఎంపీ పదవిని కోల్పోయారు.