UP Election 2022: పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో విభజన రాజకీయాలు జోరందుకున్నాయి! 2013 నాటి ముజఫర్‌నగర్ అల్లర్లు, 2014-16 మధ్యకాలంలో కైరానా నుంచి హిందువుల వలసలు, శ్రీకృష్ణ జన్మభూమి (మథుర), దేవ్‌బండ్‌లో ఉగ్ర నిరోధక దళం-ఏటీఎస్ కేంద్రానికి శంకుస్థాపన (జాతీయభావాన్ని ప్రస్తావించేందుకు వీలుగా) వంటి అంశాలను భాజపా నేతలు ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తద్వారా హిందువుల ఓట్లను తమకు అనుకూలంగా సంఘటితం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
భాజపా ప్రచారాస్త్రాలు అవే..
ముస్లింలు భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో హిందువులు వలసబాట పడుతున్నారని కైరానా మాజీ ఎంపీ హుకుం సింగ్ (భాజపా) చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం సృష్టించాయి. జాట్లు, ముస్లింల మధ్య చీలిక తీసుకురావడం, హిందువుల ఓట్లను తమవైపు తిప్పుకోవడమే అప్పట్లో ఆయన ప్రధాన ఉద్దేశం! కానీ మెల్లగా అది శాంతిభద్రతలకు సంబంధించిన అంశంగా మారిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ కమలనాథులు ఆ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. జాట్లు, ముస్లింలు ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి వైపు మొగ్గకుండా చూడాలన్నదే వారి అభిమతమని అర్థమవుతోంది! కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కైరానా వలసల ప్రభావిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి ప్రజలు ఇంకెంతమాత్రమూ భయంభయంగా జీవించాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో అడుగు ముందుకేసి.. ''వాళ్లు ఇక్కడ కైరానా ద్వారా కశ్మీర్‌ను సృష్టించాలని కలలు కంటున్నారు'' అని ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Farmers Protest: అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహం
వివాదాస్పద సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 700 మందికి పైగా రైతులు అసువులు బాశారు. ఆ విషయాన్ని అన్నదాతలు అంత త్వరగా మర్చిపోరు. లఖింపుర్ ఖేరీలో తమ సహచరులను అత్యంత కర్కశంగా కారుతో తొక్కించి చంపిన వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రపై మోదీ సర్కారు చర్యలేవీ తీసుకోకపోవడంపై కూడా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కైరానా వలసలు, మథుర వంటి మతపరమైన అంశాల ప్రస్తావనతో వారి ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. అయితే, భాజపా ప్రయత్నాలు అంతగా సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
అలా చీలితే.. భాజపాకు లాభమే