ఉత్తర్‌ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లింది. 75 జిల్లా పంచాయతీ ఛైర్‌పర్సన్ సీట్లకు గానూ 60కి పైగా స్థానాలను కైవసం చేసుకుంది. అదే సమయంలో అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ 6 స్థానాలకే పరిమితమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వెలువడిన ఈ ఫలితాలు భాజపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే అవకాశం ఉంది.
మొత్తం 75 స్థానాలకు గానూ 67 స్థానాల్లో భాజపాకు చెందిన మద్దతుదారులు ఛైర్‌పర్సన్లు గెలుపొందినట్లు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్ తెలిపారు. ఇదే ఊపుతో 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మొత్తం 3 వేల మంది జిల్లా పంచాయతీ సభ్యులు 75 మంది ఛైర్‌పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోలింగ్‌కు ముందే 21 చోట్ల భాజపా మద్దతుదారులు, ఎస్పీకి చెందిన ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాలకు శనివారం ఉదయం ఓటింగ్ నిర్వహించి అనంతరం ఫలితాలు వెల్లడించారు. పార్టీ గుర్తులు లేకుండా ఈ ఎన్నికలు జరిగాయి.
60 స్థానాల నుంచి...
2016లో జరిగిన ఇవే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ 60 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాతి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం నమోదు చేయడం గమనార్హం. మరోవైపు ఈ ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని ఎస్పీ ఆరోపించింది. ఈ ఎన్నికలకు మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) దూరంగా ఉంది.