తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో సంక్షేమ పథకాలపైనే భాజపా ఆశలు

UP assembly election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎన్నికల్లో తమకు కలిసొస్తాయని భాజపా భావిస్తోంది. లబ్ధిదారులు తమకు అండగా నిలుస్తారని విశ్వసిస్తోంది. విపక్ష ఎస్పీ సైతం సంక్షేమ మంత్రంతోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.

UP assembly election 2022
UP assembly election 2022

By

Published : Feb 24, 2022, 6:47 AM IST

UP assembly election 2022:ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలంటే కులమతాల లెక్కలేనన్నది ఒకప్పటి మాట! ఇప్పుడు ప్రచార పర్వంలో వాటితోపాటు ప్రధానంగా వినిపిస్తున్న మరో అంశం- 'సంక్షేమం'. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో సింహభాగం యూపీకే దక్కుతుండటం, రాష్ట్రంలోనూ గత ఐదేళ్లలో తమ సర్కారు పలు ప్రజాకర్షక పథకాలను విజయవంతంగా అమలుచేయడం.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అతిపెద్ద సానుకూలాంశాలని భాజపా ధీమాగా చెబుతోంది. మరోవైపు- అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ).. నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి విషయాల్లో అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుంటూనే.. తాము అధికారంలోకొస్తే అణగారిన వర్గాల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని హామీ ఇస్తోంది.

BJP UP election

మోదీ సర్కారుకు కలిసొచ్చాయ్‌!

2014లో కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన మోదీ సర్కారు-1.. సమాజ శ్రేయస్సుకు సంబంధించిన అంశాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు భావించి, తదనుగుణంగా చర్యలకు ఉపక్రమించింది. పీఎం ఆవాస్‌ యోజన, పీఎం ఉజ్వల్‌ యోజన, పీఎం కిసాన్‌ నిధి యోజన, ముద్ర రుణాలు, పీఎం జీవన్‌ సురక్షా యోజన వంటి ప్రత్యక్ష ప్రయోజన పథకాలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. 2014-19 మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్లమంది అలాంటి పథకాలతో లబ్ధి పొందారు. ఆ ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికల్లో కనిపించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 17.1 కోట్ల ఓట్లు రాగా.. 2019లో ఆ సంఖ్య 22.9 కోట్లకు పెరిగింది. కుల, మత సమీకరణాలతోపాటు సంక్షేమ పథకాలూ ఆ ఎన్నికల్లో పార్టీ విజయానికి బాగా దోహదపడ్డాయి. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ మోదీ, యోగి ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై కమలదళం ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.

యోగి రాకతో..

దేశంలోకెల్లా అత్యధిక లోక్‌సభ స్థానాలను(80) కలిగి ఉన్న యూపీ ప్రాధాన్యం తెలుసు కాబట్టే.. 2014 నుంచీ మోదీ సర్కారు ఆ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ వస్తోంది. కేంద్ర సంక్షేమ పథకాలను అక్కడ విస్తృతంగా అమలు చేస్తోంది. దీనికితోడు 2017 నుంచి యోగి ప్రభుత్వం సొంతంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. కొవిడ్‌ మహమ్మారి దెబ్బకు బతుకులు ఛిద్రం కావడంతో.. కేంద్రంతో చేతులు కలిపిన యోగి సర్కారు 2020 తొలినాళ్ల నుంచి పేదలకు ఉచితంగా రేషన్‌ అందిస్తోంది. ఇందులో భాగంగా పేద కుటుంబాల్లో ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున గోధుమలు, 5 కిలోల చొప్పున బియ్యం నెలనెలా అందజేస్తోంది. ఒక్కో కుటుంబానికి లీటర్‌ రిఫైన్డ్‌ నూనె, కిలో చక్కెర, కిలో ఉప్పు కూడా ప్రతినెలా అందుతున్నాయి. రాష్ట్రంలో 15 కోట్లమంది (18 ఏళ్ల లోపున్నవారితో కలుపుకొని) రెండేళ్లుగా ఈ ప్రయోజనాలను పొందుతున్నారు. 2012-17 మధ్య అఖిలేశ్‌ నేతృత్వంలోని ఎస్పీ ప్రభుత్వమూ పేదలకు ఉచితంగా రేషన్‌ అందించింది. కానీ అప్పుడు అవినీతి ఎక్కువగా ఉండేదని.. డీలర్లు ఎస్పీ శ్రేణులకే సరకులు ఇచ్చి, మిగిలినవాటిని అక్రమంగా అమ్ముకునేవారని ఆరోపణలున్నాయి. అఖిలేశ్‌ హయాంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయని స్థానికంగా టీకొట్టు నడుపుతున్న రామధీర్‌ మహతో చెప్పారు. ఇప్పుడూ కొంత అవినీతి ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు బాగానే అందుతున్నాయని పేర్కొన్నారు. అందుకే మోదీ-యోగి ద్వయంపై ప్రజల్లో సానుకూల ధోరణి ఉందని తెలిపారు. "యూపీలో 15.2 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. వారిలో దాదాపు 6 కోట్లమంది ఏదో ఓ రూపంలో మా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారు. వారే మాకు అతిపెద్ద ఓటుబ్యాంకు" అని స్థానిక భాజపా నాయకుడు దయాశంకర్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ ఫలాలివీ..

BJP welfare schemes in UP

  • వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు గతంలో నెలకు రూ.500 పింఛను అందేది. దాన్ని యోగి సర్కారు రూ.వెయ్యికి పెంచింది.
  • సీఎం జన్‌ ఆరోగ్య యోజనతో 41.19 లక్షల మందికి జీవిత బీమా అందుబాటులోకి వచ్చింది.
  • ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకంలో భాగంగా 1.52 లక్షల మంది యువతులకు వివాహం జరిపించారు.
  • 28,951 మంది నిర్మాణరంగ కూలీల కుమార్తెల పెళ్లిళ్ల కోసం ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు.
  • 'హర్‌ ఘర్‌ జల్‌' ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది.
  • పీఎం ఆవాస్‌ యోజన, సీఎం ఆవాస్‌ యోజన పథకాల్లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 43 లక్షల ఇళ్లు నిర్మించారు.

అఖిలేశ్‌దీ అదే రాగం..

తాజా ఎన్నికల్లో సంక్షేమ పథకాలు కీలకంగా మారే అవకాశాలున్నాయని ఎస్పీ కూడా గుర్తించింది. అందుకే అఖిలేశ్‌ యాదవ్‌ ప్రచారంలో సంబంధిత అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే.. భాజపా ఉచిత రేషన్‌ను నిలిపివేసే అవకాశముందని పేర్కొంటున్నారు. తాను సీఎం పీఠమెక్కితే ఐదేళ్లపాటు ఉచితంగా రేషన్‌ అందిస్తానని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సరకులకు అదనంగా ఒక్కో కుటుంబానికి నెలకు లీటరు ఆవనూనె అందజేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం భాజపా హయాంలో ఆవనూనె, ఇతర నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'ప్రజా సమస్యలు గాలికి... ఉగ్రవాదం నెత్తికి'

ABOUT THE AUTHOR

...view details