మహారాష్ట్రలోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. శనివారం ఉదయం మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఆయన కార్యాలయానికి 11:25 నుంచి 12:30 గంటల మధ్య దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన వాడినంటూ ఓ వ్యక్తి మూడు సార్లు కాల్స్ చేసి రూ. 100 కోట్లు డిమాండ్ చేశాడు. సమాచారం అందుకొన్న నాగ్‌పుర్ పోలీసులు హుటాహుటిన ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ఆ కాల్స్‌పై పూర్తి విచారణ చేపట్టిన పోలీసులు కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి ఈ కాల్స్ చేసినట్లు గుర్తించారు. వెంటనే క్రైమ్ బ్రాంచ్ బృందాన్ని కర్ణాటకకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.
'100 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా!'.. నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్ - మహారాష్ట్ర నాగ్‌పుర్ కేంద్ర మంత్రి కార్యాలయం
దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడుని అని చెప్పుకునే ఓ అగంతకుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి మూడు సార్లు బెదిరింపు కాల్స్ చేశాడు. రూ. 100 కోట్లు ఇవ్వకపోతే గడ్కరీపై బాంబ్‌తో దాడి చేసి చంపేస్తాని నిందితుడు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
"కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి తాను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ మెంబర్‌ను అని చెప్పి గడ్కరీ కార్యాలయానికి మూడు సార్లు కాల్ చేశాడు. గడ్కరీ నుంచి రూ. 100 కోట్లు డిమాండ్ చేశాడు. తన డిమాండ్ నెరవేర్చకుంటే.. మంత్రిపై బాంబు దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. తన అడ్రస్‌కు డబ్బు పంపించమని కోరాడు. తన ఫోన్ నంబర్, చిరునామా చెప్పాడు. ఆ నిందితుడికి గతంలో నేర చరిత్ర కూడా ఉంది. నిందితుడు చెప్పిన అడ్రస్‌కు క్రైమ్ బ్రాంచ్ బృందాన్ని పంపించాము" అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుతం నాగ్‌పుర్‌లో ఉన్నారు. అక్కడ ఆయన మకర సంక్రాతి వేడుకలు జరుపుకోనున్నారు. దీంతో ఆయన వేడుక జరుపుకునే ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు నాగ్‌పుర్ డీసీపీ తెలిపారు.
గడ్కరీ నొయిడాలో శుక్రవారం ఉదయం ఆటో ఎక్స్పో 2023 ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా భారత్ త్వరలోనే అవతరించబోతోందని ఆయన అన్నారు. దేశంలో రూ.7.5 లక్షల కోట్ల ఆటోమొబైల్ పరిశ్రమలను విస్తరింపచేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.