మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు గానూ కేంద్ర చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణెను మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. జన ఆశీర్వాద్ యాత్రలో ఉన్న ఆయన్ని రత్నగిరి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ వ్యవహారం భాజపా-శివసేన మధ్య మరింతగా అగ్నికి ఆజ్యం పోసింది.
సోమవారం రాయ్‌గఢ్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఠాక్రే.. మన దేశానికి స్వాతంత్య్రం ఏ ఏడాది వచ్చిందో గుర్తులేక వెనుకనున్నవారిని అడిగి తెలుసుకున్నారనీ, తాను గానీ అక్కడ అప్పుడు ఉంటే ఆయన్ని చాచి లెంపకాయ కొట్టేవాడినని రాణె చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. తానెలాంటి నేరానికి పాల్పడలేదని మంత్రి సమర్థించుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై శివసేన నాయకులు ముంబయిలో సైబర్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రాయ్‌గఢ్ జిల్లా మహద్‌తో పాటు, నాసిక్, పుణెల్లోనూ కేసులు నమోదయ్యాయి.
అరెస్టు తర్వాత తనకు రక్తపోటు ఎక్కువైందని, మధుమేహ స్థాయి పెరిగిందని మంత్రి చెప్పడంతో వైద్య పరీక్షలు చేయించారు. తదుపరి విచారణ నిమిత్తం రాయ్‌గఢ్ పోలీసులకు అప్పగించారు. రాత్రి పొద్దుపోయాక మహాద్‌లోని మెజిస్ట్రేట్ కోర్టులో మంత్రిని హాజరుపరచగా బెయిలు మంజూరైంది. పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోసం బాంబే హైకోర్టులో రాణె తొలుత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన అభ్యర్థించారు. మంగళవారమే అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా రాణె తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను జస్టిస్ ఎస్.ఎస్.శిందే, జస్టిస్ ఎన్.జే.జమాదర్‌ల ధర్మాసనం తిరస్కరించింది.