గుజరాత్‌లోని దారుణ ఘటన వెలుగు చూసింది. మైనర్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లి.. ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించాడు ఆమె మేనమామ. అయితే బాలికకు సంబంధించిన ఓ అశ్లీల వీడియో బయటకు రావడం వల్ల ఆమె గ్రామస్థులకు విషయం తెలిసింది. వెంటనే బాధితురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..ఝార్ఖండ్‌కు చెందిన ఓ 13 ఏళ్ల బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గుజరాత్ తీసుకెళ్లాడు ఆమె మేనమామ. అక్కడ ఓ కంపెనీలో ఆమె నెలరోజులు పనిచేసింది. ఏవో కారణాలతో ఆ కంపెనీ మూతపడింది. దీంతో తనను ఇంటికి తీసుకెళ్లమని ఆమె అడిగింది. లేకపోతే వేరే కంపెనీలోనైనా ఉద్యోగం ఇప్పించమని కోరింది. అప్పుడు ఆమెను తన మేనమామ ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం వేరే వారితో వ్యభిచారం చేయమని చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించడం వల్ల బలవంతంగా చేయించాడు.
అయితే కొన్నిరోజుల తర్వాత బాలికను తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో బాధితురాలికి సంబంధించిన ఓ అశ్లీల వీడియో వైరల్ అయింది. అది చూసిన గ్రామస్థులు.. బాలికను వ్యభిచార ఊబిలోకి నెట్టిన ఆమె మేనమామతో పాటు అతడి భార్యను బంధించారు. అయితే వారిద్దరూ చాకచక్యంగా తప్పించుకుని పారిపోయారు. దీంతో గ్రామస్థులంతా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'న్యాయం జరిగితేనే అంత్యక్రియలు'.. పట్టుబట్టి కూర్చున్న కుటుంబీకులు
మరోవైపు.. తమ కుమార్తెపై జరిగిన దారుణానికి న్యాయం జరగకపోతే మృతదేహానికి అంత్యక్రియలు చేయబోమని మృతురాలి కుటుంబసభ్యులు పట్టుబట్టి కూర్చున్నారు. దహన సంస్కారాలు జరుపకుండా మృతదేహాన్ని ఉప్పుతో కప్పివేసి 42 రోజులుగా అలానే ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నందురుబార్ జిల్లాలో జరిగింది.
బాధితురాలి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ధడ్‌గావ్ ప్రాంతానికి చెందిన ఓ వివాహితను ఆగస్టు 1న బలవంతంగా కొందరు వ్యక్తులు కారులో ఎక్కించి తీసుకెళ్లారు. అయితే కొద్దిసేపటికే వావి ప్రాంతంలోని మామిడి చెట్టుకు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. ఘటనాస్థలికి తాము చేరుకునేలోపే నిందితులు.. తమ కుమార్తె మృతదేహాన్ని కిందకు దించి సాక్ష్యాలను ధ్వంసం చేశారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెపై రంజిత్‌తో పాటు అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారని, అది పోలీసులకు చెబుతున్నా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అయితే పోలీసులు.. బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షలు చేయించారు. ఆ నివేదిక ప్రకారం ఆత్మహత్య కేసు నమోదు చేశామని చెబుతున్నారు.