దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అదుపులో ఉందని భావిస్తోన్న వేళ.. గుజరాత్లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. బీఎఫ్.7 అనే వేరియంట్ కేసు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమోదైంది. ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి అధికమని వైద్యులు తెలిపారు. 60 ఏళ్ల వృద్ధుడికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకిందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జులై 15.. రోగి శాంపిల్స్‌ను గాంధీనగర్‌లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌కు పంపగా.. అక్టోబరు 17న నివేదిక వచ్చింది. అందులో రోగికి ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్.7 సోకినట్లు నిర్ధరణ అయ్యిందని అధికారులు తెలిపారు. అతడితో సన్నిహితంగా ఉన్న 10 మందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని పేర్కొన్నారు.
దేశంలో పలు ప్రాంతాల్లో కొత్త వేరియంట్ కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఎంటాగీ ఛైర్మన్ ఎన్‌కే అరోఢా, వ్యాక్సిన్ గ్రూప్ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి తీరుపై చర్చించిన నిపుణులు.. దేశవ్యాప్తంగా మాస్కులు, కరోనా నిబంధనలు పాటించడాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మహారాష్ట్రలో గతవారంలో నమోదైన కరోనా కేసుల్లో 17.7శాతం పెరుగుదల కనిపించింది. వీటిలో ఎక్కువగా ఒమిక్రాన్ ఉపరకమైన ఎక్స్‌బీబీ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న బీఏ.2.75తో పోలిస్తే విస్తృత వేగంతో వ్యాప్తి చెందడంతోపాటు రోగనిరోధకతను తప్పించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫ్లూ మాదిరి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని.. వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. మరోవైపు.. కేరళలో పలు చోట్ల ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతుండడం వల్ల అక్కడి ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్‌లో మార్పులతో కొత్త రకాలు పుట్టుకొస్తున్నందున.. వైరస్ కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు.