Ukraine war: రష్యా బలగాల దాడులతో వణికిపోతోన్న తూర్పు ఉక్రెయిన్‌లో వెయ్యి మంది భారతీయులు చిక్కుకుపోయారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఖర్కివ్ 300, సుమీలో 700 మంది భారత పౌరులు ఉండిపోయారని తెలిపింది. వారిని ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఈ అంశంపై ఉక్రెయిన్, రష్యా దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
'ఆపరేషన్ గంగా'తో 10వేల మంది..
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తరలించేందుకు చేపట్టిన 'ఆపరేషన్ గంగా' కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 48 ప్రత్యేక విమానాల్లో 10,300 మందిని స్వదేశానికి తీసుకువచ్చినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. 'ఫిబ్రవరిలో అడ్వైజరీ జారీ చేసిన తర్వాత దాదాపు 20వేల మంది ఉక్రెయిన్ సరిహద్దులను దాటారు. వారిలో ఇప్పటికే 10వేలకుపైగా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చాం. 24 గంటల్లో మరో 16 విమానాలు భారత్‌కు రానున్నాయి. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాం. అక్కడ నుంచి తరలించేందుకు ఉన్న అన్ని మార్గాలపై దృష్టి సారించాం. మా పౌరులను తీసుకెళ్లేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ పాటిస్తే కాస్త ఊరట కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతం నుంచి భారతీయులను తరలించడమే మా తక్షణ కర్తవ్వం' అని విదేశాంగశాఖ వెల్లడించింది.