Ujjwala Yojana Subsidy Hike : పేద మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.200 రాయితీని రూ.300 చేసింది. ఈ మేరకు బుధవారం దిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు మంత్రి అనురాగ్ ఠాకూర్. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 903 కాగా.. ఉజ్వల యోజన వినియోగదారులు రూ.703 చెల్లిస్తున్నారు. తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో కేవలం రూ.603 చెల్లించనున్నారు.
పసుపు బోర్డు, కేంద్ర గిరిజన యూనివర్సిటీకి ఆమోదం
Turmeric Board Benefits : దీంతో పాటు తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి అనురాగ్ ఠాకూర్. సమ్మక సారక్క పేరిట ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పసుపు బోర్డు వల్ల దేశంలో పసుపుపై అవగాహనతో పాటు ఉత్పత్తి పెరుగుదల, కొత్త మార్కెట్ల ఏర్పాటు, విదేశాలకు ఎగమతులు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం రూ.1,600 కోట్ల పసుపును విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని.. దానిని రూ.8,400 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
పసుపు నాణ్యతతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించేలా ఈ బోర్డు చర్యలు తీసుకుంటుందని వాణిజ్య శాఖ తెలిపింది. ఈ బోర్డు ఛైర్మన్‌ను కేంద్రం నియమిస్తుందని.. ఆయుష్, ఔషధ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమ శాఖలు సభ్యులుగా ఉంటాయని చెప్పింది. మూడు రాష్ట్రాల ప్రతినిధులు రోటేషన్ పద్ధతిలో సభ్యులుగా కొనసాగుతారని.. పసుపుపై పరిశోధనలు చేసే సంస్థలు, రైతులు, ఎగుమతుదారులు, వాణిజ్య శాఖ నియమించే కార్యదర్శి సభ్యుడిగా ఉంటారని పేర్కొంది.