తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో రూపొందించే పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నాయి ఆయా రాజకీయా పార్టీలు. డీఎంకే కూడా.. 234 సీట్ల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కుస్తీ పడుతోంది. అయితే ఈ ఎన్నికల్లో.. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు.. ఉదయనిధి స్టాలిన్ పోటీ చేయడం లేదన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి ఇందులో నిజమెంత? డీఎంకే వ్యూహమేంటి?
ఆ పదవి కోసమే...!
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పురపాలక సంఘం ఎన్నికలు జరగుతాయి. అంటే.. కొత్త ప్రభుత్వ పాలనలో ఈ ఎన్నికలు ఉంటాయి. ఈసారి అధికారం చేపడతామని డీఎంకే పూర్తి విశ్వాసంతో ఉంది. అందుకే.. ఉదయనిధి స్టాలిన్‌ను శాసనసభ ఎన్నికల్లో కాకుండా.. మేయర్ ఎన్నికల్లో నిలబెట్టాలని డీఎంకే చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:-'అధికారంలోకి వస్తే గృహిణులకు నెలకు రూ. వెయ్యి'
స్టాలిన్ కూడా ఇదే విధంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మాజీ సీఎం కరుణానిధి హయాంలో.. తొలుత మేయర్ ఎన్నికల్లో పోటీ చేసిన స్టాలిన్.. అంచెలంచెలుగా ఎదిగి పార్టీ సారథి స్థాయికి చేరారు. పార్టీలో ఉదయనిధికి ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. స్టాలిన్ ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
కుటుంబ రాజకీయాలు..
ఈ ఎన్నికల్లో.. చేపాక్కం-ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఉదయనిధి స్టాలిన్ దరఖాస్తు చేసుకున్నారు. గత ఆదివారం.. ఆయన్ను స్టాలిన్స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉదయనిధి.. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధమని వెల్లడించారు.
ఉదయనిధి స్టాలిన్‌కు సీటు కచ్చితంగా వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తోందంటూ పార్టీపై వ్యతిరేకత వచ్చే అవకాశముందని డీఎంకేలోని కొందరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా.. మేయర్ ఎన్నికల్లో ఉదయనిధిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు కుటుంబ రాజకీయాల అంశం అంతగా ప్రభావం చూపదని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అస్త్రంగా మలుచుకుని డీఎంకే ఎన్నికల్లోకి వెళుతోందని.. ఉదయనిధి పోటీపై పెద్దగా చర్చ ఉండదని అంటున్నారు.
"ఉదయనిధి ప్రజలను సులభంగా ఆకర్షించగలరు. సినిమాల వల్ల ఆయన ప్రజాదరణ సంపాదించుకున్నారు. పార్టీలోని ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ రాజకీయాల అస్త్రంతో ఎవరూ డీఎంకేను కిందికి దించలేరు. డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రుల కుటుంబసభ్యులకు అన్నాడీఎంకే సీటు ఇచ్చింది. కుటుంబ రాజకీయాలు అనేది దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీటిపై వచ్చే విమర్శలను ప్రజలు పట్టించుకోరు."
--- ఆళి సెంథిల్నధన్, రాజకీయ నిపుణుడు.
కుటుంబ రాజకీయాల వ్యవహారం డీఎంకేలో కొత్తేమీ కాదు. గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. కానీ ఈ ప్రభావం ఉదయనిధి స్టాలిన్‌పై ఎక్కువగా ఉంది. పార్టీ యువజన నేతగా ఆయనకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి డీఎంకేలో కుటుంబ రాజకీయాల అంశం వార్తల్లో నిలిచింది.
ఇదీ చూడండి:-'మా పార్టీ మేనిఫెస్టోను డీఏంకే కాపీ కొట్టింది'