Two Lakhs Necklace Gift To Teacher : పాఠాలు చెప్పిన టీచర్‌పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటారు ఓ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు. రూ.2.10లక్షలు విలువ చేసే 33 గ్రాములు బంగారు నెక్లెస్‌ను విశ్రాంత ఉపాధ్యాయురాలికి బహుకరించారు. ఇది చూసిన ఆ టీచర్, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అరుదైన సన్నివేశం కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా అక్కరంగడిలోని దారుల్ ఇస్లాం ఎయిడెడ్ పాఠశాలలో జరిగింది.
3 దశాబ్దాలు- 2వేల మందికి బోధన
మంగళూరు సమీపంలోని అక్కరంగడి గ్రామంలో దారుల్ ఇస్లాం ఎయిడెడ్ సీనియర్ ప్రైమరీ స్కూల్ ఉంది. ఇందులో జయలక్ష్మి ఆర్ భట్ అనే మహిళ గత 31ఏళ్లుగా ఉపాధ్యాయురాలు తన సేవలందించారు. ఈ సమయంలో సుమారు 2వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించారు. వాస్తవానికి జయలక్ష్మి పదవీ విరమణ గడువు 2020లోనే ముగిసింది. ఇదే సంవత్సరం ఆమె రిటైర్మెంట్ పొందారు. అయితే పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా ఆమెను కొన్నేళ్ల పాటు అలానే కొనసాగించింది స్కూల్ యాజమాన్యం. ఈ సమయంలో ఆమె, ఒక్కపైసా జీతం తీసుకోకుండానే విద్యార్థులకు పాఠాలు బోధించారు. తన బోధనా శైలితో విద్యార్థులందరికీ ఫేవరేట్ టీచర్‌గా మారిపోయారు జయలక్ష్మి.
గిఫ్ట్ కోసం స్పెషల్ వాట్సాప్ గ్రూప్
అయితే, తాము చదువుకున్న పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా పాఠాలు చెబుతూ ఎందరో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన టీచర్ జయలక్ష్మికి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశారు పూర్వ విద్యార్థులు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఇందులో పూర్వ విద్యార్థులందరినీ యాడ్ చేసి ఇతరులెవ్వరికీ తెలియకుండా రహస్యంగా చర్చించుకున్నారు. పదవీ విరమణ పొందిన తమ ప్రియమైన ఉపాధ్యాయురాలు జయలక్ష్మికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండేలా గోల్డ్ నెక్లెస్‌ను ఇవ్వాలనుకున్నారు. దీనికోసం అందరూ ఆర్థికంగా తమకు తోచినంత డబ్బును కూడగట్టారు. అలా మొత్తం రూ.2.10లక్షలను పోగు చేశారు. ఈ మొత్తంతో 33 గ్రాముల బరువుగల బంగారు హారాన్ని కొని తమ అభిమాన టీచరైన జయలక్ష్మికి బుధవారం నిర్వహించిన స్కూల్ వార్షిక దినోత్సవంలో అందజేశారు. పిల్లల అభిమానాన్ని చూసిన ఆ టీచర్, ఆశ్చర్యానికి గురై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇదే కార్యక్రమంలో ఆమె తన టీచర్ వృత్తికి వీడ్కోలు పలికారు.