క్యాన్సర్.. ఆయన జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఒక కాలును కోల్పోయి, దివ్యాంగుడిగా మారేందుకు కారణమైంది. ఇప్పుడు రెండో కాలుకూ అదే సమస్య. అయినా.. ఆయన అధైర్యపడలేదు. సంకల్ప బలాన్ని, సైకిల్‌ను ఆయుధంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. వందలు కాదు, వేలు కాదు.. ఏకంగా రెండు లక్షల కిలోమీటర్లు ఒంటి కాలితో సైక్లింగ్ చేసి విధిరాతను ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే.. డాక్టర్ రాజు తురకానే.
రాజుది మహారాష్ట్రలోని అమరావతి. 2007లో డెంటల్ మెడిసిన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు. అయితే.. కొన్నేళ్ల క్రితం ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. క్యాన్సర్ కారణంగా ఒక కాలును తొలగించాల్సి వచ్చింది. అయినా.. ఏమాత్రం అధైర్యపడకుండా ఉక్కు సంకల్పంతో ముందుకు సాగారు రాజు. ఒంటి కాలితోనే సైకిల్ తొక్కడం సాధన చేశారు. దిల్లీ-ముంబయి, ముంబయి-పుణె, ముంబయి-నాగ్‌పుర్ సహా మరెన్నో యాత్రల్ని సైకిల్‌పైనే పూర్తి చేశారు. ఇప్పటివరకు ఆయన దాదాపు రెండు లక్షల కిలోమీటర్లు ఒంటి కాలితో సైక్లింగ్ చేసి.. రికార్డు సృష్టించారు. ఇప్పుడు రాజు రెండో కాలుకూ క్యాన్సర్ వ్యాపించింది. అయినా.. ఇలానే పోరాడి వ్యాధిని జయిస్తానని, సైక్లింగ్ కొనసాగిస్తానని ధీమాగా చెబుతున్నారు రాజు.