దేశవ్యాప్తంగా కరోనా 2.0 విజృంభిస్తోంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ విస్తరించకుండా ఉండటానికి మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం పాటించడం ఎంత అవసరమో ఈ రెండో దశ కరోనా వ్యాప్తి చెబుతోంది.
కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బిహార్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఒక గ్యాడ్జెట్‌ను తయారు చేశారు. ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉంటే ఆ గ్యాడ్జెట్ అతడిని మీటర్ దూరంలోనే గుర్తిస్తుంది. వెంటనే అందులోని అలారం మోగుతుంది. ఫలితంగా.. కరోనా లక్షణాలున్న ఆ వ్యక్తికి దూరంగా ఉండవచ్చు.
ఈ కరోనా అలర్ట్ డివైజ్‌ని పాట్నాకిల్కారీకి చెందిన 10, 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అర్పిత్, అభిజీత్ తయారు చేశారు.
మీటరు దూరం నుంచే ఓ వ్యక్తి శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను ఈ 'కరోనా అలర్ట్ డివైజ్'లో ఉండే సెన్సార్లు గుర్తిస్తాయి. ఈ డివైజ్ చిన్నగా ఉంటుంది. షర్ట్ జేబులో దీన్ని పెట్టుకోగలము. వ్యక్తి దగ్గినా, తుమ్మినా లేదా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా ఈ డివైజ్ యాక్టివ్ అయ్యి.. అలారాన్ని మోగిస్తుంది.
"కరోనా సంక్షోభ సమయంలో, లాక్డౌన్ విధించినప్పుడు ప్రాణాంతకమైన ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రజలు పోరాడారు. చుట్టుపక్కల ఉన్న వారి ఉష్ణోగ్రతను గుర్తించడానికి కరోనా అలర్ట్ డివైజ్‌ను తయారు చేయాలని అప్పుడు మేము నిర్ణయించుకున్నాం."