కట్‌మనీ తప్పిదం ప్రస్తుత ఎన్నికల్లో అధికార తృణమూల్‌ను ఎక్కువగా భయపెడుతోంది. బంగాల్‌లో ఏ ప్రభుత్వ పథకం, లబ్ధి పొందాలన్నా అందులో కొంత శాతం అధికార తృణమూల్ కార్యకర్తలకు ముడుపుగా చెల్లించుకోవాల్సిందే! దాన్నే 'కట్‌మనీ' అని అంటారు. ఇది విపక్షాలు చేసే ఆరోపణ మాత్రమే కాదు.. స్వయంగా తృణమూల్ అధ్యక్షురాలు మమత బెనర్జీ సైతం అంగీకరించిన నిజం. అంత్యక్రియలకిచ్చే 2వేల రూపాయల నుంచి మొదలెడితే.. సొంతింటి నిర్మాణ పథకం దాకా.. పథకం ఏదైనాగానీ తృణమూల్ కార్యకర్తలకు రూ.200 నుంచి 25,000 దాకా ముడుపు చెల్లించుకోవాల్సిందే! ప్రతిదానికీ ఓ రేటుగట్టి తృణమూల్ కార్యకర్తలు, ప్రతినిధులు ఈ ముడుపు కట్టించుకుంటారని ప్రచారంలో ఉంది. ఇది తృణమూల్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టింది. అందుకే మమత బెనర్జీ 2019లో ఓ బహిరంగ ప్రకటన కూడా చేశారు. 2011 నుంచి (పార్టీ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి) ఇప్పటిదాకా కట్‌మనీ రూపంలో తీసుకున్న సొమ్మును ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని తన పార్టీ కార్యకర్తలకు, ప్రతినిధులకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 18 సీట్లు గెలవగానే మమత ఈ ప్రకటన చేయటం గమనార్హం. ఆ పిలుపునకు స్పందించి కొంతమంది డబ్బులు తిరిగిచ్చేశారు కూడా!
తృణమూల్ మద్దతుదారులూ ఈ కట్‌మనీ సంస్కృతిపైనే ఆందోళన, ఆవేదనతో ఉన్నారు. "ప్రభుత్వ పథకాలు పొందుతున్నాను. కానీ పార్టీ కార్యకర్తలకు ఈ ముడుపులే బాధగా ఉన్నాయి. ముడుపులివ్వనిదే ఏ లబ్ధీరాదు" అని ఓ కార్యకర్త వ్యాఖ్యానించటం గమనార్హం. అభివృద్ధి పేరుతో చేపట్టిన పనులన్నీ తృణమూల్ కార్యకర్తలు డబ్బులు తినటానికేనన్నది భాజపా ఆరోపణ. తృణమూల్ సీనియర్ నాయకుడు సౌగధారాయ్ వాటిని తిప్పికొడుతున్నారు. "ఒకప్పుడు ఈ కట్‌మనీ సమస్య ఉండేది. ఇప్పుడది పెద్ద సమస్య కాదు. ఈ ఎన్నికల్లో అదంత విషయం కాదు" అని కొట్టిపారేశారు. మొత్తానికి ప్రభావం ఎలా ఉంటుందోగాని.. తృణమూల్ స్వయంకృతాపరాధం భాజపాకు కట్‌మనీ రూపంలో బలమైన అస్త్రాన్ని అందించింది!
ఈ అవలక్షణం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గుర్తించిన మమత సర్దిచెప్పటానికిగాను ప్రజల వద్దకు పాలన అనే పేరుతో సమస్యల్ని పరిష్కరించేందుకు ఓ కార్యక్రమం చేపట్టారు. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ ముడుపుల వ్యవహారంపై ఆందోళనలు చెలరేగాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పదేపదే ఈ కట్‌మనీ అంశాన్ని ప్రస్తావించిన భాజపా నేతలు ఈసారి కూడా ఆ విషయాన్ని ప్రజలకు గుర్తుచేస్తున్నారు. తృణమూల్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లటానికున్న ఈ అవకాశాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలు ఏమాత్రం జారవిడుచుకోవటం లేదు. తాజాగా పురులియా బహిరంగ సభలో కూడా ప్రధాని మోదీ ఈ అంశాన్ని లేవనెత్తారు. భాజపా అధ్యక్షుడు నడ్డా అయితే మరో అడుగు ముందుకేసి.. బంగాల్ ప్రజలకు కరోనాకే కాకుండా.. కట్‌మనీకి కూడా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.